అరరె, కోవిడ్ మరణాలకు పరిహారమివ్వలేనన్న కేంద్రం..

No Exgratia For Covid Victims Families, Says Govt

No Exgratia For Covid Victims Families, Says Govt

అధికారంలో వున్నోళ్ళ పబ్లిసిటీ స్టంట్స్ కోసం డబ్బులుంటాయ్.. కానీ, కోవిడ్ మరణాలకు పరిహారమిచ్చేందుకు డబ్బులు సరిపోవు. ఇదెక్కడి లాజిక్.? దేశం గొంతు విప్పాల్సిన సందర్భమిది. దేశంలో కరోనా విలయం నేపథ్యంలో కనీ వినీ ఎరుగని స్థాయిలో మరణాలు చోటు చేసుకున్నాయి. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. నిజానికి ఇది నేషనల్ డిజాస్టర్. భూకంపాలు సంభవించినప్పుడో, వరదలొచ్చినప్పుడో.. మృతుల కుటుంబాలకు ప్రభుత్వాలు పరిహారం అందిస్తాయి కదా.? అలాంటిదే కరోనా వైరస్ మహమ్మారి కూడా.

పైగా, ఇది పాలకుల నిర్లక్ష్యం కారణంగా ప్రజల్ని మింగేసిన వైరస్. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. అధికారంలో వున్నోళ్ళు.. అధికారం కోసం అగచాట్లు పడుతున్నవారూ.. అందరూ కలిసి రాజకీయ నిర్లక్ష్యం ప్రదర్శించడం వల్లే దేశంలో ఈ స్థాయిలో కరోనా వ్యాప్తి జరిగింది. సకాలంలో విదేశాల నుంచి విమానాల్ని ఆపేసి వుంటే.. దేశంలో కరోనా ఇంతలా విరుచుకుపడేదే కాదు. ఎలా చూసినా తప్పిదాలన్నీ కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు చేసినవేనన్న విమర్శ వుంది.

సరే, ఇక్కడ తప్పెవరిదన్నది వేరే చర్చ. కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాల్ని మానవీయ కోణంలో ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద వుంది కదా.? ఏదో ఒక పథకం పేరు చెప్పి బాధిత కుటుంబాల్ని ఆదుకుంటే.. అది దేశానికే మంచిది. ఔను, ప్రజల కోసం ఎంత ఖర్చు చేసినా.. అది తిరిగి ఏదో ఒక రూపంలో ఖజానాకే చేరుతుంది కదా.? కానీ, కేంద్రం.. అందరికీ పరిహారం ఇవ్వడం కుదరదని తేల్చేసింది. ఇదెక్కడి చోద్యం.? తల్లిదండ్రుల్ని కోల్పోయిన చిన్నారులకు సాయం చేస్తామంటున్నాయి ప్రభుత్వాలు.. అలాంటప్పుడు.. అందరికీ పరిహారమిస్తే నష్టమేంటి.?