New Year : కొత్త సంవత్సరం వైఎస్ జగన్ ప్రభుత్వానికి కొత్త సంకటం

New Year : కోవిడ్ భయాల నుంచి కోలుకుంటున్నామని అనుకునేంత లోపే కొత్త వేరియంట్ భయపెడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలూ విలవిల్లాడుతున్నాయ్. మన దేశం ఇందుకు మినహాయింపేమీ కాదు. చాలా రాష్ర్టాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయనే లోపు మళ్లీ ఉపద్రవం వచ్చి పడింది.

ఉమ్మడి తెలుగు రాష్ర్టం నుంచి విడిపోవడం మొదలు 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్, నేటికీ సమస్యలతో సావాసం చేయాల్సి వస్తోంది. కారణం ఏదైనా ఆంధ్రప్రదేశ్ తన స్థాయికి మించి అప్పులు చేస్తోంది. సంక్షేమం తప్ప అభివృద్ధి లేదు. సంక్షేమం వల్ల ఓటు బ్యాంకు రాజకీయం తప్ప, రాష్ర్టం ముందడుగు వేయడానికి ఉపయోగపడదు.

ఎప్పటికప్పుడు కొత్త అప్పుల్ని వెతుక్కుంటున్న ఆంధ్ర ప్రదేశ్, కొత్త సంవత్సరంలో ఏం చేయబోతోంది.? ఒమిక్రాన్ వేవ్ అత్యంత భయానకంగా ఉండబోతోందన్న అంచనాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆందోళనలోకి నెట్టేస్తున్నాయ్. దేశంలో చాలా రాష్ర్టాలు ఆంక్షల సుడిగుండంలోకి వెళుతున్నాయ్.

ఆంధ్రప్రదేశ్ కూడా అదే బాటలో పయనించాల్సి రావచ్చు. అదే జరిగితే, ఆంధ్ర ప్రదేశ్ ఆర్ధిక పరిస్థితి ఏమవుతుంది.? రాష్ర్ట ఆదాయం, రాష్ర్ట అప్పులు ఒకదానితో ఒకటి పొంతన లేకుండా నడుస్తున్నాయ్. ఇప్పటికే చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించాలి. కొత్త అప్పులు తెచ్చుకోవాలి.

ఇదిలా ఉంటే, సెకండ్ వేవ్ అనుభవాల నేపథ్యంలో మూడో వేవ్ వస్తే.. వైద్యం మాటేమిటి.? అని సామాన్యుడు ఆందోళన చెందుతున్నాడు. పొరుగు రాష్ర్టాల్లో సరిహద్దులు మూసేయడం, అక్కడ అంబులెన్సుల్లో రోగులు నానా తంటాలూ పడడం రెండో వేవ్ సందర్భంగా చూశాం. ఇవన్నీ గుర్తు చేసుకుంటే, ఆంధ్ర ప్రదేశ్ వాసుల వెన్నులో వణుకు పుట్టకుండా ఉంటుందా.?