గ్రేటర్ ఎన్నికల్లో పార్టీ టిక్కెట్ కావాలంటే ముందు పది వేలు డిపాజిట్ చేయాలని తెలంగాణ కాంగ్రెస్ కొత్త నిబంధన విధించింది. రిజర్డ్వ్ సీట్లలో పోటీ చేసేవారైతే 5 వేల రూపాయలు చెల్లంచాలని షరతు విధించింది. కాంగ్రెస్ టిక్కెట్టు కోసం ధరఖాస్తు చేసుకునేటప్పుడే ఈ మొత్తాన్ని డిపాజిట్ చేయాలనే షరతు విధించింది. ఈ ఆలోచన చేశారు AICC రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్. నిధుల సమస్యతో ఇబ్బంది పడుతున్న కాంగ్రెస్ పార్టీకి కొంత ఊరట కల్పించేందుకు ఈ ఉపాయం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో తెలంగాణ కాంగ్రెస్ కోర్ కమిటీ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
సహజంగానే ప్రతీసారి గ్రేటర్ హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసేందుకు ఎక్కువ మంది ఆసక్తి కనబరుస్తారు. పోటీ చేసే శక్తి ఉన్నా లేకున్నా గాంధీభవన్లో అప్లికేషన్లు ఇచ్చే వారి సంఖ్య నానాటికి పెరిగిపోతుండడంతో ఈ షరతు విధించారు. తమిళనాడులో ఎన్నిక ఏదైనా.. పోటీకి ఆసక్తికనబరిచేవారు కొంత మొత్తాన్ని డిపాజిట్ చేయాలనే నిబంధన ఉందని మాణిక్యం ఠాగూర్ తెలంగాణ కాంగ్రెస్ నేతలకు వివరించారు. ఈ నిబంధనతో ఊరికే అప్లై చేసే వాళ్ల సంఖ్య గణనీయంగా తగ్గిందని ఇదే విధానాన్ని తెలంగాణలో కూడా అమలు చేయాలని సూచించారు. ఈ కొత్త విధానానికి తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా ఓకే చెప్పడంతో గ్రేటర్ ఎన్నికల్లో ఈ కొత్త నిబంధన అమలు కాబోతోంది.
సిటీ ప్రెసిడెంట్‌గా ఉన్న మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్… అందర్ని కలుపుకుపోవడం లేదని మాణిక్యం ఠాగూర్ కు ఈపాటికే ఫిర్యాదులు అందాయి. అంజన్, ముఖేష్ వర్గాల మధ్య నెలకొన్న వర్గ పోరు పార్టీకి గ్రేటర్ పరిధిలో తీవ్ర నష్టాన్ని కలిగిస్తోందని పార్టీ నేతలు కూడా మాణిక్యం ఠాగూర్ కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ముందు ఈ గొడవులను సెట్ రైట్ చేసి కొత్త ప్రయోగాలు చేస్తే బాగుంటుందని సూచించారు. దీనికి తోడు ఇంఛార్జులను కాదని డివిజన్లకు కాంగ్రెస్ అధ్యక్షులను నియమించడంపై కూడా సరికాదని ఇంఛార్జ్ కు ఫిర్యాదు చేశారట.