హైదరాబాద్ మహానగర అభివృద్ధి ప్రాధికార సంస్థ (హెచ్ఎండీఏ) పరిధిని విస్తరించే దిశగా ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. తాజా ప్రతిపాదనల ప్రకారం, ప్రస్తుతం ఉన్న 7,257 చదరపు కిలోమీటర్ల పరిధిని 13,000 చదరపు కిలోమీటర్లకు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నిర్ణయంతో నాలుగు కొత్త జిల్లాలు, 32 మండలాలు హెచ్ఎండీఏలో చేరనుండగా, నగరాభివృద్ధి మరింత వేగంగా జరగనుంది.
ట్రిపుల్ ఆర్ రీజనల్ రింగ్ రోడ్ పక్కన ఐదు కిలోమీటర్ల వరకు పరిధిని విస్తరించడమే తాజా ప్రణాళికలో ప్రధానాంశం. ఈ నిర్ణయంతో నగర శివారు ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ డిమాండ్ భారీగా పెరగనుంది. ఇప్పటికే ట్రిపుల్ ఆర్ కారణంగా భూముల ధరలు పెరిగిన శివారు ప్రాంతాల్లో, తాజా విస్తరణతో మరింత ఉత్సాహం కనిపించనుంది. రియల్ ఎస్టేట్ రంగంలో దశాబ్దాల తరబడి ఊరించని అభివృద్ధి చోటు చేసుకుంటుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
2006లో హుడాను హెచ్ఎండీఏగా మారుస్తూ పరిధిని పెద్దదిగా చేసిన ప్రభుత్వం, ఇప్పుడు మళ్లీ ఇదే దిశగా మరింత విస్తరణకు సన్నాహాలు చేస్తోంది. హైదరాబాద్ మహానగర పరిధిని పెంచడంతోపాటు జీహెచ్ఎంసీ పరిధిని కూడా 2,000 చదరపు కిలోమీటర్లకు విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్త గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను కూడా చేర్చనున్నారు. ఈ విస్తరణతో నగర అభివృద్ధి పనులు కొత్త దిశగా సాగనుండగా, రియల్ ఎస్టేట్ రంగం మరింత ప్రోత్సహింపబడనుంది. ప్రభుత్వం చేపట్టిన ఈ చర్యలు హైదరాబాద్‌ను భవిష్యత్తులో మరింత విస్తారమైన పట్టణంగా మలచడం ఖాయమని నిపుణులు భావిస్తున్నారు.