టీమిండియాకు క‌రోనా భ‌యం.. హోట‌ల్ ప‌క్క‌న ప్ర‌మాద‌క‌ర వేరియెంట్ కేసులు

లాక్‌డౌన్ త‌ర్వాత భార‌త జ‌ట్టు ఆస్ట్రేలియాతో త‌ల‌ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. ముందుగా మూడు వ‌న్డేలు ఆడిన టీమిండియా సిరీస్ కోల్పపోయింది. ఆ త‌ర్వాత జరిగిన టీ 20లో రెండు మ్యాచ్‌లు గెలిచి ఈ సిరీస్ ద‌క్కించుకుంది. ఇక ప్ర‌స్తుతం నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జ‌రుగుతుండ‌గా, ఇప్ప‌టికే మూడు మ్యాచ్‌లు పూర్త‌య్యాయి. ఇందులో రెండు జ‌ట్లు చెరొక మ్యాచ్ గెల‌వ‌గా, ఓ మ్యాచ్ డ్రాగా ముగిసింది. బ్రిస్బేన్ లో జ‌ర‌గ‌నున్న చివ‌రి టెస్ట్ మ్యాచ్‌తో ఫ‌లితం తేల‌నుండగా దీనిపై అంద‌రిలో ఆస‌క్తి నెల‌కొంది.

ఆస్ట్రేలియాతో నాలుగో టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు ఇప్ప‌టికే టీమిండియా బ్రిస్బేన్ చేరుకోగా , వారిని క‌ఠిన‌మైన క్వారంటైన్‌లో ఉంచారు. అయితే తాజాగా హోట‌ల్ ప‌క్క‌న ఉన్న గ్రాండ్ చాన్సెల‌ర్ హోట‌ల్లో రెండు ప్ర‌మాద‌క‌ర యూకే వేరియంట్ క‌రోనా కేసులు బ‌య‌ట‌ప‌డ్డాయి. దీంతో ఉలిక్కిప‌డ్డ అధికారులు చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. హోట‌ల్‌లో ఉన్న ఇద్ద‌రికి కరోనా అని తేల‌డంతో మిగ‌తా 250 మంది గెస్ట్‌ల‌ను అక్క‌డి క్వీన్స్‌ల్యాండ్ ప్ర‌భుత్వం మ‌రో హోట‌ల్‌కు త‌ర‌లించింది.

క్వీన్స్‌ల్యాండ్‌లో అమ‌ల్లో ఉన్న క‌ఠిన క్వారంటైన్ నిబంధ‌న‌ల నేప‌థ్యంలో అస‌లు బ్రిస్బేన్ వెళ్ల‌డానికే టీమిండియా ఇష్ట‌ప‌డ‌లేదు. కాని బీసీసీ, క్రికెట్ ఆస్ట్రేలియా మ‌ధ్య జ‌రిగిన చ‌ర్చ‌ల‌తో మ్యాచ్ ఆడేందుకు సిద్ద‌మ‌య్యారు. జిమ్, స్విమ్మింగ్ పూల్ ఇలా ఏది వాడుకోనీయ‌మంటూ వారు క‌ఠిన‌మైన నిబంధ‌న‌లు పెట్టారు. జ‌న‌వ‌రి 15న నాలుగో టెస్ట్ మ్యాచ్ జ‌ర‌గ‌నుండ‌గా, ఈ మ్యాచ్‌కు 50 శాతం మంది ప్రేక్ష‌కుల‌ని అనుమ‌తించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. ప్ర‌తి ఒక్క‌రు మాస్క్ త‌ప్ప‌ని స‌రి ధ‌రించాల‌ని ప్ర‌భుత్వం సూచ‌న‌లు చేస్తుంది.