అడుసు తొక్కనేల కాలు కడగనేల.. జగన్ సర్కార్ తీరు మారదా?

ఏ రాష్ట్రంలోనైనా అధికారంలో ఉండే పార్టీ ప్రజలకు మేలు చేకూరేలా నిర్ణయాలు తీసుకుంటే మాత్రమే ఆ పార్టీకి భవిష్యత్తు ఉంటుంది. పార్టీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే మాత్రం ఆ పార్టీకే భవిష్యత్తులో నష్టం కలిగే అవకాశాలు కూడా ఉంటాయి. ప్రస్తుతం జగన్ సర్కార్ విషయంలో అడుసు తొక్కనేల కాలు కడగనేల అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జగన్ సర్కార్ తీరును మార్చుకోదా అని ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

ఏపీలో పాఠశాలల విలీనం విషయంలో వైసీపీ సర్కార్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయనే సంగతి తెలిసిందే. అయితే తాజాగా జగన్ సర్కార్ వైసీపీ ఎమ్మెల్యేల సూచనల మేరకు పాఠశాలలలో తరగతుల విలీనం విషయంలో వెనక్కు తగ్గింది. జిల్లాస్థాయి కమిటీల నివేదికలను అనుసరించి విద్యార్థులకు ఇబ్బందులు కలుగుతున్న చోట విలీనం ఆపే దిశగా జగన్ సర్కార్ అడుగులు వేస్తోంది.

ప్రభుత్వ నిర్ణయం వల్ల 400 పాఠశాలలలో విలీన ప్రక్రియ ఆగిపోనుందని సమాచారం అందుతోంది. 70 మంది ఎమ్మెల్యేల సూచనల ప్రకారం 400 పాఠశాలలలో విలీనం ఆగిపోగా మిగిలిన పాఠశాలలలో మాత్రం విలీనం విషయంలో ప్రభుత్వం వెనక్కు తగ్గదని తెలుస్తోంది. పాఠశాలల విలీనం వల్ల విద్యార్థులు ఇబ్బంది పడితే సంబంధిత అధికారులే బాధ్యత వహించాలని ప్రభుత్వం చెప్పడం కొసమెరుపు.

జగన్ ప్రభుత్వం ప్రజలకు నచ్చని నిర్ణయాలను తీసుకొని ఆ నిర్ణయాలను అమలు చేసి విమర్శలు వ్యక్తమైన తర్వాత ఆ నిర్ణయాల విషయంలో వెనక్కు తగ్గుతుండటం గమనార్హం. ప్రజల్లో వ్యతిరేకత పెరిగిన తర్వాత ప్రభుత్వం నిర్ణయాలు మారినా పెద్దగా ప్రయోజనం అయితే ఉండదు. జగన్ సర్కార్ చాలా విషయాలకు సంబంధించి ఇదే విధంగా వ్యవహరిస్తోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.