ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్.. ఏపీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే కదా. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఎన్నికల కమిషన్ తో సహకరించడం లేదని ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కనీసం ఎన్నికల కమిషన్ కు నిధులు కూడా ఇవ్వడం లేదు.. ప్రభుత్వం నిధులను మంజూరు చేయకుండా నిలిపి వేసిందంటూ నిమ్మగడ్డ తన పిటిషన్ లో పేర్కొన్న సంగతి తెలిసిందే.
దీనిపై కోర్టు విచారణ చేపడుతున్న సమయంలో… ఎన్నికల కమిషనర్ వ్యక్తిగత అంశం ప్రస్తావనకు వచ్చింది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కు హైదరాబాద్ లో అధికారిక నివాసం ఉన్నదనే విషయం జడ్జి దృష్టికి రావడడంతో.. జస్టిస్ దేవానంద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ.. హైదరాబాద్ లో ఒకటి.. విజయవాడలో మరోటి.. రెండు అధికార నివాసాలు.. ఏపీ సీఈసీకి అవసరమా? అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
పిటిషన్ వేయడం వల్ల న్యాయవాదులను ఎన్నికల కమిషన్ చెల్లించాల్సిన ఫీజు సుమారు 5 కోట్లు కూడా పన్నుల రూపంలో ప్రజలు చెల్లిస్తున్న డబ్బే అంటూ న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఇలా ప్రజల డబ్బును దుర్వినియోగం చేయడం సరైన పద్ధతి కాదని నిమ్మగడ్డ రమేశ్ పై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇది గురువారం హైకోర్టులో జరిగిన విచారణ. దీనిపై లోకల్, జాతీయ మీడియా ఎలా స్పందించిందో తెలుసా? నేషనల్ మీడియాలైన హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా, దక్కన్ క్రానికల్, న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ మాత్రం నిమ్మగడ్డకు హైదరాబాద్ లో అధికారిక నివాసం ఎందుకు? ఏపీ ఎన్నికల కమిషనర్ కు హైదరాబాద్, ఏపీ రెండు ప్రాంతాల్లో అధికారిక నివాసాలు అవసరమా? అని కోర్టు ప్రశ్నించిందని ఉన్నది ఉన్నట్టుగా రాయగా.. మన తెలుగు లోకల్ పత్రికల్లో కొన్ని అటు.. మరికొన్ని ఇటుగా రాశాయి.
అంటే.. ఆంధ్రజ్యోతి, ఈనాడు మాత్రం ప్రభుత్వం సహకరించడం లేదు, లాయర్లకు ఇంత సొమ్మా.. అంటూ హెడ్డింగ్ లు పెట్టి.. అసలు విషయాన్ని దాచినట్టుగా అనిపిస్తే.. సాక్షి, ప్రజాశక్తి లాంటి పత్రికలు.. హైకోర్టు చెప్పినదాన్నే రాశాయి. జనం సొమ్ముతో హైదరాబాద్ లో ఇల్లా? అంటూ సాక్షి రాయగా… ఎస్ఈసీ అధికార నివాసంపై హైకోర్టు విస్మయం అంటూ ప్రజాశక్తి రాసింది.