గత కొన్ని రోజుల నుంచి ఏపీ ఎన్నికల కమిషనర్ కు, ఏపీ ప్రభుత్వానికి పొసగడం లేదు. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో నిమ్మగడ్డ ఏకంగా హైకోర్టుకే ఎక్కారు. ఏపీ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు ఈసీతో సహకరించడం లేదంటూ పిటిషన్ దాఖలు చేశారు. దానిపై కోర్టులో విచారణ కూడా జరుగుతోంది.
ఈ నేపథ్యంలో నిమ్మగడ్డ మరోసారి ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. వైసీపీ అబద్ధపు ప్రకటేనలు చేస్తోందని… స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఆరోగ్య శాఖ అధికారులను తాము సంప్రదించలేదంటూ.. వైసీపీ ప్రకటించడం సమంజసం కాదన్నారు. తాము ఆరోగ్య శాఖ అధికారులను సంప్రదించామని.. వైసీపీ ప్రకటనల్లో నిజం లేదంటూ నిమ్మగడ్డ స్పష్టం చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఆయన ఏపీలోని పార్టీల అభిప్రాయాలను తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన నిమ్మగడ్డ.. 11 పార్టీలు ఎన్నికలపై తమ అభిప్రాయాన్ని తెలిపాయన్నారు.
కరోనా దృష్ట్యా… ఆరోగ్యశాఖ కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీతో చర్చలు జరిపామని.. అలాగే ఏపీ సీఎస్ తోనూ దీనిపై చర్చించామని నిమ్మగడ్డ స్పష్టం చేశారు.