ఆంధ్ర ప్రదేశ్ :తన పదవీ కాలం పూర్తి అయ్యేలోపల ఎలాగైనా ఎన్నికలు జరపాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పట్టు పట్టి కుర్చున్నారట. అధికారం లో ఉన్న ప్రభుత్వం మీద ప్రతీకారానికి ఆయనకీ ఇది మాత్రమే దారట. ఆయన ఎప్పుడైనా షెడ్యూల్ విడుదల చేసే అవకాశముందంటున్నారు. బహుశ జనవరి నెల సంక్రాంతి పండగ అనంతరం నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశముంది. ఈ మేరకు ఆయన కసరత్తులు పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. బ్యాలట్ బాక్స్ లు సమకూరిన వెంటనే ఎన్నికలకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ పచ్చ జెండా ఊపనున్నారు.
హైకోర్టు కూడా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. నిమ్మగడ్డను నిలువరించేదెలా అన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం కూడా తీవ్రంగా ఆలోచిస్తుంది. అన్ని మార్గాలనూ అన్వేషిస్తుంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల కమిషనర్ గా ఉన్నంత వరకూ స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లకూడదన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది.
నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలం వచ్చే ఏడాది మార్చి తో పూర్తి కానుంది. ప్రభుత్వం మార్చి తర్వాత ఎన్నికలు నిర్వహించాలన్న యోచనలో ఉంది. కానీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ జనవరిలోనే ప్రక్రియను పూర్తిచేసే పనిలో ఉన్నారు. ఈ మేరకు ఆయన అన్ని రకాలుగా సిద్ధం చేస్తున్నారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలను జరుపుతున్న తీరును కూడా ఆయన పరిశీలిస్తున్నారు. వివిధ రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై అక్కడ ఎన్నికల కమిషన్ లు అనుసరించిన విధానాలను కూడా తెప్పించుకుంటున్నారు.
దీంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ సంక్రాంతి పండగ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశముందంటున్నారు. వైసీపీ ప్రభుత్వం ఇందుకు సహకరించే అవకాశాలు కన్పించడం లేదు. ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎన్నికల నిర్వహణ ఇప్పట్లో సాధ్యం కాదని తేల్చి చెప్పారు. అయినా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ముందుకు వెళితే ఎలా చేయాలన్న దానిపై న్యాయనిపుణులు, రాజ్యాంగ నిపుణలతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను నిలువరించేదెలా? అన్న దానిపైనే వైసీపీ నేతలు కసరత్తులు చేస్తున్నారు.