‘ప్రతిపక్ష నేత ఇంటిపైకి నీ ఎమ్మెల్యేలనీ, బులుగు గుూండాలనీ పంపావంటేనే, తాడేపల్లి కొంపలో ఎంతగా వణికి ఛనస్తున్నావో అర్థం అవుతుంది. ఇంతకంటే నువ్వు దిగజారవని అనుకున్న ప్రతిసారీ అధఃపాతాళంలోకి దిగజారుతూనే వున్నావు..’ అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ, మాజీ మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు ట్విట్టర్ వేదికగా. నిజానికి, ఇలాంటి వ్యాఖ్యలు ఆయనకు కొత్తేమీ కాదు. ‘జనం తిరగబడే రోజు దగ్గరపడింది..’ అంటూ తన ట్వీటులో నారా లోకేష్ పేర్కొన్నారు. నిజమే, జనం తిరగబడ్డారు.. అదీ, 2019 ఎన్నికల్లో.. అందుకే, తెలుగుదేశం పార్టీ 23 ఎమ్మెల్యే సీట్లకు పరిమితమైపోయింది. ‘తాడేపల్లి కొంప..’ ‘వణికి ఛస్తున్నావ్..’ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సభ్యత.? సంస్కారం.? అన్నది నారా లోకేష్ ఆలోచించుకోవాలి. వాస్తవానికి.. రాజకీయాల్లో వుండాల్సిన ఈ సభ్యత, సంస్కారం ఎప్పుడో కనుమరుగైపోయాయ్.
‘మగాడివైతే సీబీఐ విచారణ వెయ్ రా..’ అంటూ జగన్ మీద విరుచుకుపడిపోయిన నారా లోకేష్ నుంచి సభ్యత, సంస్కారాల్ని ఆశించలేం. ఆ మాటకొస్తే, ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థలో ఏ నాయకుడి నుంచీ వాటిని ఆశించలేని పరిస్థితి. అయితే, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎందుకు భయపడతారు.? జగన్ ఇంకా సీరియస్‌గా తీసుకోవడంలేదుగానీ, తీసుకుంటే.. టీడీపీ ఖాళీ అయిపోవడమెంతసేపు.? మొన్నటికి మొన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పార్టీకీ.. ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు.. అతన్ని బుజ్జగించడానికి టీడీపీ అధినేత చంద్రబాబు జుట్టు పీక్కోవాల్సి వచ్చింది. టీడీపీలో ఇంతటి సంక్షోభం వున్నప్పుడు, అధికార వైసీపీ ఎందుకు ఆందోళన చెందుతుంది.? ఆ మాత్రం ఆలోచన వుంటే, నారా లోకేష్ ఎందుకిలా ట్విట్టర్ ద్వారా చెలరేగిపోతారు.? ‘పార్టీ లేదు.. డాష్ లేదు..’ అని ఏపీ టీడీపీ అధ్యక్షుడు వ్యాఖ్యానించినప్పుడు లోకేష్ ఏమైపోయారు.?