తిరుపతిలో నారా లోకేష్ ప్రమాణం: వైఎస్ జగన్ ఎక్కడ.?

Nara Lokesh Did It, But Ys Jagan Don'T

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకి సంబంధించి నిజాలు నిగ్గుతేలడంలేదు. రెండేళ్ళయినా, ఆఖరికి కేసు విచారణ సీబీఐ చేతికి వెళ్ళినా, వైఎస్ వివేకానందరెడ్డిని అత్యంత దారుణంగా హత్య చేయాల్సిన అవసరం ఎవరికి వుంది.? అన్న విషయమై స్పష్టత లేకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.? వైసీపీ తరఫున ఎన్నికల ప్రచారంలో బిజీగా వున్న వివేకానందరెడ్డిని రాత్రి వేళ.. ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో అతి కిరాతకంగా దుండగులు హత్య చేశారు రెండేళ్ళ క్రితం.

ఆయన్ని టీడీపీనే హత్య చేయించిందని అప్పట్లో వైసీపీ ఆరోపించింది. అయితే, అధికారంలోకి వచ్చాక, విచారణలో సరిగ్గా వ్యవహరించలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద నేరుగా ఆరోపణలు చేసిన వివేకా కుమార్తె, సీబీఐ విచారణకు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఉదంతాన్ని తిరుపతి ఉప ఎన్నిక వేళ రాజకీయంగా వాడుకునేందుకుగాను, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ‘ఏప్రిల్ 14న తిరుపతిలో ప్రమాణం చేస్తా.. ఆ హత్యతో నా కుటుంబానికి సంబంధం లేదని.. మీరూ వస్తారా జగన్ రెడ్డిగారూ.?’ అంటూ సవాల్ విసిరిన లోకేష్, మాటకు కట్టుబడి ఈ రోజు ప్రమాణం చేశారు తిరుపతిలో. అయితే, కరోనా నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్, తిరుపతి ఉప ఎన్నిక ప్రచారాన్ని ఇటీవల రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. తాను సవాల్ విసిరాకే, ముఖ్యమంత్రి ఆ పర్యటనను రద్దు చేసుకున్నారని నారా లోకేష్ ఆరోపిస్తున్నారు. అత్యంత సున్నితమైన విషయమిది.

రాజకీయ ప్రత్యర్థులకు అవకాశమివ్వకుండా చేసేందుకు అయినా, తిరుపతికి వైఎస్ జగన్ వెళ్ళి వుండాల్సిందేమో. ఏదిఏమైనా, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిజాలు నిగ్గు తేలాలి. అత్యంత కిరాతకంగా వివేకానందరెడ్డి చంపబడితే, గుండెపోటుతో చనిపోయారన్న వార్త కుటుంబ సభ్యుల నుంచి మీడియాకి ఎలా అందిందన్నదే అత్యంత కీలకమైన ప్రశ్న ఇక్కడ.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles