తెలంగాణలో బీజేపీ మార్కు ‘పొలిటికల్ గేమ్’ మొదలైనట్టేనా.?

BJP Mark Politics In Telangana

BJP Mark Politics In Telangana

ఇప్పుడు కొత్తగా మొదలవడమేంటి.? తెలంగాణలో బీజేపీ గేమ్ ఎప్పుడో మొదలైంది. అందుకే, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల్ని మొదట్లో తప్పు పట్టిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆ తర్వాత క్రమంగా ‘ఎదురు తిరగడం’ మానేశారు. ఏదో తూతూ మంత్రం విమర్శలు మినహా, బీజేపీకి తెలంగాణ రాష్ట్ర సమితి ఇవ్వాల్సిన స్థాయిలో కౌంటర్ ఇవ్వలేకపోతోంది. తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి ఇప్పటికే మాజీ మంత్రి ఈటెల రాజేందర్, బీజేపీలోకి దూకేశారు.

ఈ క్రమంలో ఆయన పద్ధతిగా తన ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేయడం గమనార్హం. త్వరలో హుజూరాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుంది. దుబ్బాక ఉప ఎన్నికలో లాభపడ్డ బీజేపీ, నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో ఓడిపోయినా నష్టపోయిందేమీ లేదు. గ్రేటర్ ఎన్నికల్లో కూడా బీజేపీకి లాభమే. గత పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ ఎంతలా లాభపడిందో అందరికీ తెలిసిందే. సో, హుజూరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ గెలిస్తే, అది బోనస్ అవుతుంది ఆ పార్టీకి. ఇదిలా వుంటే, తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీ నామా నాగేశ్వరరావుపై ఈడీ దాడులు జరిగాయి.

ఈ దాడుల్ని రాజకీయ కోణంలో చూస్తున్నారు టీఆర్ఎస్ నేతలు. నామాపై బీజేపీ నుంచి ఒత్తిడి వుందనీ, ఆయన గనుక ఒత్తిడికి తలొల్గితే.. తెలంగాణ రాష్ట్ర సమితికి కష్టకాలమేనన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. ‘నామా త్వరలోనే బీజేపీలోకి వెళ్ళిపోవడం ఖాయం. నామా నాగేశ్వరరావు అంటే, ఒకప్పుడు చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడు. ఓ సుజనా చౌదరి.. ఓ నామా నాగేశ్వరరావు.. అని అప్పట్లో చెప్పుకునేవారు.. టీడీపీలో చంద్రబాబు సన్నిహితుల గురించి. సుజనా చౌదరి, బీజేపీలోకి వెళ్ళాకే ఆయనకు సీబీఐ, ఈడీ నుంచి తలనొప్పులు తగ్గాయి. దాంతో, నామా కూడా, బీజేపీ వైపుకు వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదేమో. అదే జరిగితే, టీఆర్ఎస్ పెద్ద దెబ్బ తినాల్సి రావొచ్చు.