నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కన్నుమూశారు. ఆయనకు గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. నోముల గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు.
ఆయన వయసు 64 ఏళ్లు. తన ఇంట్లోనే తీవ్రంగా అస్వస్థతకు గురికావడంతో ఆయన్ను వెంటనే అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే.. ఆసుపత్రికి తీసుకెళ్తుండగానే మార్గమధ్యంలోనే ఆయన మృతి చెందినట్టు డాక్టర్లు తెలిపారు. తీవ్రమైన గుండెనొప్పి కారణంగానే ఆయన తుదిశ్వాస విడిచినట్టు డాక్టర్లు వెల్లడించారు.
నోముల రాజకీయ ప్రస్థానం
నోముల సీఫీఎం పార్టీ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1999, 2004 సంవత్సరాల్లో ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ తర్వాత 2013లో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. అంతకుముందు 2009లో భువనగిరి నుంచి ఎంపీగా పోటి చేసి ఓడిపోయారు.
2014 లో టీఆర్ఎస్ పార్టీ తరుపున నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కాంగ్రెస్ నుంచి జానారెడ్డి గెలుపొందారు. ఆ తర్వాత 2018 ఎన్నికల్లో మళ్లీ టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి అదే జానారెడ్డిపై గెలుపొందారు. నోములది నల్గొండ జిల్లాలోని పాలెం. ఆయన 1956 జనవరి 9న జన్మించారు.