ఒక్కప్పుడు తెలంగాణ రాష్ట్రములో టీడీపీ పార్టీలో కీలకమైన నేతగా చలామణి అయినా నాగం జనార్దన్ రెడ్డి, నేడు తన రాజకీయ జీవితమే అగమ్యగోచరంగా మారిపోయింది. 1983 లో తెలుగుదేశం పార్టీ నుండి రాజకీయ జీవితం ప్రారంభించిన నాగం అనతికాలంలోనే కీలక నేతగా ఎదిగాడు. అయితే తెలంగాణ ఉద్యమం సమయంలో జరిగిన అనేక పరిణామాల నేపథ్యంలో టీడీపీ నుండి బయటకు వెళ్లి, తెలంగాణ నగారా పార్టీ అంటూ కొత్త పార్టీని స్థాపించాడు. అదే పార్టీతో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు.
తెరాసకి వచ్చిన క్రేజ్ నాగంకు రాలేకపోయింది. నిజానికి తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటూ కొత్త పార్టీలను పెట్టిన నేతలను కేసీఆర్ తన తెలివైన ఎత్తుగడలతో వాళ్ళని చిత్తు చేసి, కేవలం తెరాస మాత్రమే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది అనే విషయాన్నీ జనాల్లోకి తీసుకోని వెళ్లటంలో సక్సెస్ అయ్యాడు. ఇక టీడీపీ నుండి బయటకు వచ్చిన నాగం, బీజేపీ పార్టీలో చేరాడు. అయితే అక్కడ కూడా తనకు సరైన గౌరవం లభించలేదని భావించి కొంతకాలానికే ఆ పార్టీకి దూరంగా వుంటూ వచ్చాడు, ఈ క్రమంలో కాంగ్రెస్ లోకి చేరాలని అనుకున్న సమయంలో పాలమూరు కాంగ్రెస్ నేతలు గట్టిగా వ్యతిరేకించారు. అయితే అప్పట్లో మహబూబ్ నగర్ కాంగ్రెస్ లో చక్రం తిప్పిన జైపాల్ రెడ్డి సహాయంతో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయాడు.
నాగూర్ కర్నూల్ నుండి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాగం జనార్దన్ ప్రస్తుతం అదే నియోజకవర్గ బాధ్యతలు చూసుకుంటున్నాడు. ప్రస్తుతం మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి సరైన నాయకత్వం లేదు. జైపాల్ రెడ్డి చనిపోవటం, ఆ తర్వాత డీకే అరుణ కాంగ్రెస్ ను వీడి, బీజేపీలోకి చేరటంతో కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం సమస్య వేధిస్తుంది. నాగం జనార్దన్ లాంటి సీనియర్ నేత ఆ బాధ్యతలు చూసుకోవాలని అక్కడి స్థానిక నేతలు కొందరు కోరుకుంటున్నారు. కానీ నాగం జనార్దన్ రెడ్డి మాత్రం అందుకు సుముఖంగా ఉన్నట్లు కనిపించటం లేదు. ఆయన వైఖరి చూస్తే కాంగ్రెస్ లో కూడా ఉండటం ఇష్టం లేనట్లు కనిపిస్తుంది. అయితే తెరాస లో చేరటం కూడా నాగం కు ఇష్టం లేదు. అటు బీజేపీ లో ఇమడలేక, ఇటు కాంగ్రెస్ లో కలవలేక, తెరాసలో చేరలేక నాగం పడుతున్న ఇబ్బందులు చూస్తుంటే అయ్యో పాపం అనిపించక మానదు.