ఎన్నికల్లో పోటీపై చేతులెత్తేసిన జాగబాబు.!

2019 ఎన్నికల్లో నర్సాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు నాగబాబు. లోక్ సభకు నాగబాబు పోటీ చేయడమే కాదు, ప్రచారమూ గట్టిగానే చేశారు. అయితే, చివరి నిమిషంలో జనసేనలో చేరి, ఆదరాబాదరాగా పార్టీకి అభ్యర్థులే లేనట్టు నాగబాబు రంగంలోకి దిగడం వల్ల పార్టీకి అది మైనస్ అయ్యింది.

నాగబాబు గనుక, ముందే నిర్ణయించుకుని.. నియోజకవర్గం పరిధిలో.. అందునా గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నించి వుంటే, ఆయన గెలిచేందుకు ఆస్కారం వుండేది, ఆ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోనే వున్న భీమవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ కూడా గెలిచేందుకు అవకాశం వుండేది.

ఇక, 2024 ఎన్నికల కోసం కాస్త ముందుగానే ‘పని’ ప్రారంభించింది జనసేన. నాగబాబు కూడా రంగంలోకి దిగారు. ఊరూ వాడా పర్యటిస్తున్నారు.

పార్టీలో కొత్త ఉత్సాహం నింపేందుకు ప్రయత్నిస్తున్నారు. తిరిగి నర్సాపురం నుంచే నాగబాబు పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతుండగా, తాను ఎక్కడి నుంచీ పోటీ చేయడంలేదని ఆయన తేల్చి చెప్పడంతో జనసైనికులు షాక్‌కి గురయ్యారు.

‘పోటీ చేసినా గెలిచే అవకాశం లేదు కాబట్టే నాగబాబు ఇలా అంటున్నారు..’ అన్నది చాలామంది అభిప్రాయం. ‘నాగబాబు పోటీ చేయకపోవడమే మంచిది. తద్వారా ఆయన రాష్ట్రమంతా తిరగగలుగుతారు.. ‘ అంటూ కొందరు జనసైనికులు అభిప్రాయపడుతున్నారు.

ఏదిఏమైనా, నాగబాబు ప్రకటనతో కొంత అలజడి అయితే జనసైనికుల్లో కనిపిస్తోంది.ఈ సమయంలో ఇలాంటి ప్రకటన పార్టీకి మంచిది కాదనే అభిప్రాయం జనసేన నేతల్లోనూ వ్యక్తమవుతోంది. ‘పోటీ చేయబోను..’ అని నాగబాబు పైకి చెబుతున్నా, ఆయన పోటీ చేసే నియోజకవర్గం ఎప్పుడో ఖాయైపోయిందనే ప్రచారం ఇంకా జరుగుతూనే వుంది.

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా నుంచి కాకపోతే, ఉమ్మడి తూర్పోగదావరి జిల్లా.. అదీ కుదరకపోతే మరో నియోజకవర్గం నుంచి నాగబాబు లోక్ సభకే పోటీ చేస్తారన్నది అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం.