ఇదో పెద్ద మిస్టరీలా మారిపోయింది. దేశంలో ఏ రెండు రాష్ట్రాల మధ్యా ప్రజా రవాణాపై ఆంక్షల్లేవు. కానీ, దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ఒకే తీరున వ్యవహరించడంలేదు. కొన్ని రాష్ట్రాల్లో కేసులు అత్యల్పంగా నమోదవుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఓ మోస్తరుగా నమోదవుతున్నాయి. మరికొన్ని రాష్ట్రాల్లో చాలా ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. ఎందుకిలా.? కరోనా పాజిటివ్ కేసుల పరంగా మహారాష్ట్ర టాప్ పొజిషన్‌లో వుంది. ఇది ఓవరాల్ లెక్కల సంగతి. రోజువారీ కేసుల్లోనూ అత్యధికం అనే రికార్డు మహారాష్ట్రదే. కానీ, అది ఒకప్పుడు. ఇప్పుడు నమోదవుతున్న కేసుల్లో అత్యధికం కేరళలోనే కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో దాదాపు సగం, ఆ పైన కేసులు కేరళలోనే వస్తుండడం గమనార్హం. కేరళ పొరుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఇంత తీవ్రంగా లేదు. కేరళ నుంచి పొరుగు రాష్ట్రాలకు జనం వెళుతున్నారు, వస్తున్నారు.
కేరళకీ అలాగే వెళుతున్నారు వస్తున్నారు. కానీ, కేరళలోనే కరోనా వైరస్ ఎందుకిలా విజృంభిస్తోంది.? తెలంగాణ – ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే.. ఇక్కడా స్పష్టమైన తేడాలున్నాయి. ఏపీలో టెస్టులు తక్కువగా జరుగుతున్నాయి, కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. తెలంగాణలో టెస్టులు ఎక్కువగా నమోదవుతోంటే, కేసులు తక్కువగా నమోదవుతున్నాయి. ఈ వైరుధ్యం ఎందుకు.? అన్నదానిపై వైద్య నిపుణులు ఏమీ చెప్పలేకపోతున్నారు. ఆయా రాష్ట్రాల్లో ప్రజలు వ్యవహరిస్తున్న తీరు, ప్రభుత్వాల వైఫల్యమే ఈ పరిస్థితులకు కారణమన్న వాదనా లేకపోలేదు. ఓ పక్క దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగానే జరుగుతోంది. అయినా, కరోనా పాజిటివ్ కేసులు తగ్గాల్సిన వేగంతో తగ్గకపోవడం ఆశ్చర్యకరం. మూడో వేవ్ వచ్చేసిందని కొందరు.. రాబోతోందని కొందరు చెబుతున్న దరిమిళా ప్రజల్లో ఆందోళన రోజురోజుకీ పెరుగుతోంది.