మునుగోడు బై పోల్: టీఆర్ఎస్, బీజేపీ మధ్యనేనా పోటీ.?

మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం ముగింపు దశకు వచ్చింది. ప్రధాన రాజకీయ పార్టీలు గత కొద్ది రోజులుగా ప్రచార పర్వంలో నానా తంటాలూ పడ్డాయి. చిత్ర విచిత్రమైన పబ్లిసిటీ స్టంట్లు చేశారు అభ్యర్థులు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ప్రముఖంగా కనిపించారు.. ఆయన బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన రాజీనామా చేయడంతోనే మునుగోడు ఉప ఎన్నిక వచ్చింది.

టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కూడా కొంతమేర హంగామా చేశారు. కానీ కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి హంగామా తక్కువగానే వుంది. రేవంత్ రెడ్డి ఎంతలా గింజుకున్నా, మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చేలా లేదు.

అయితే, మహిళా ఓటర్లు పాల్వాయి స్రవంతికి సైలెంటుగా ఓట్లు గెద్దేస్తారని కాంగ్రెస్ నమ్ముతోంది. తెలంగాణలో రాహుల్ జోడో యాత్ర కూడా, మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి కలిసొస్తుందనే నమ్మకంతో వున్నారు తెలంగాణ పీపీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.

ఇదిలా వుంటే, మునుగోడులో ప్రస్తుతం కనిపిస్తోన్న పరిస్థితిని బట్టి చూస్తే ప్రధానంగా పోటీ బీజేపీ – టీఆర్ఎస్ మధ్యనే కనిపిస్తోంది. ఎన్నికల ప్రచారంలోనే కాదు, ఓటర్లను ప్రలోభ పెట్టడంలోనూ ఈ రెండు పార్టీలో పోటీ పడుతున్నాయి. ఓటర్లను ప్రలోభపెట్టే క్రమంలో కాంగ్రెస్ చాలా చాలా వీక్‌గా కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి తొలుత మునుగోడుని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా, ఆయనా చేతులెత్తేయక తప్పలేదు.

కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కాంగ్రెస్ పార్టీ కోసం కాకుండా, తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డి కోసం బీజేపీకి అనుకూలంగా అనుచరులకు పిలుపునిచ్చారు.. ఏకంగా ఆయన ప్రచారానికే డుమ్మా కొట్టేశారు.. విదేశాలకు చెక్కేశారు కూడా.!