మునుగోడు ఉప ఎన్నిక: టీఆర్ఎస్‌కి అంత వీజీ కాదు.!

తెలంగాణలోని మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఉప ఎన్నిక నగారా మోగేసినట్లే. సిట్టింగ్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీకీ అలాగే ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. స్పీకర్‌కి తన రాజీనామా లేఖను ఇంకా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అందించాల్సి వున్నా, అదీ లాంఛనమే.. రాజీనామా ఆమోదం పొందడం కూడా లాంఛనమేనని తెలుస్తోంది.

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బీజేపీలో చేరనున్నారు. బీజేపీ నుంచే ఆయన మునుగోడు ఉప ఎన్నికలో పోటీ చేస్తారు. మరోపక్క, కాంగ్రెస్ పార్టీని వీడిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై, ‘ఎంగిలి మెతుకులకు కక్కుర్తి పడ్డాడు..’ అంటూ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

కాంగ్రెస్ పార్టీ అప్పుడే, మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి అంతర్గతంగా కమిటీ వేసేసుకుంది. ఈ కమిటీకి మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ నేతృత్వం వహించనున్నారు. అయితే, ఈ కమిటీలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ స్టార్ క్యాంపెయినర్, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి (రాజగోపాల్ రెడ్డి సోదరుడు) లేకపోవడం గమనార్హం.

దుబ్బాక, హుజూరాబాద్ తరహాలో మునుగోడుని కైవసం చేసుకుంటామని భారతీయ జనతా పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంటే, ఆ సీటులో గెలిచేది తామేనని తెలంగాణ రాష్ట్ర సమితి అంటోంది. తెలంగాణలో అధికారంలో వుంది గనుక, మునుగోడు నియోజకవర్గంలో కూడా హుజూరాబాద్ ఉప ఎన్నిక తరహాలో తెలంగాణ రాష్ట్ర సమితి భారీగా ఖర్చు చేసే అవకాశం లేకపోలేదు. కానీ, గెలుపు.. అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు.

అందరికన్నా కాంగ్రెస్ ముందుగా మేల్కొంటే, బీజేపీ ఎప్పటినుంచో మునుగోడు మీద స్కెచ్ వేసేసింది. ఇక, చివరగా తెలంగాణ రాష్ట్ర సమితి రంగంలోకి దూకనుందన్నమాట. ఇంతవరకు కాంగ్రెస్, టీఆర్ఎస్ నుంచి మునుగోడు నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికకు సంబంధించి అభ్యర్థులు ఖరారు కాలేదు.

వచ్చే ఎన్నికలకు ముందర జరుగుతున్న ఉప ఎన్నిక కావడంతో, టీఆర్ఎస్‌కి మునుగోడు ఉప ఎన్నిక చావో రేవో.. అన్నట్టేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.