‘పది వేలు ఇస్తేగానీ ఓటు వెయ్యం’ అని మునుగోడు ప్రజానీకం, ఓట్ల కోసం తమ వద్దకు వస్తున్న రాజకీయ పార్టీలకు చెందిన నేతలకు తెగేసి చెబుతున్నారట. అందరూ కాదుగానీ, చాలామంది ఇదే మాట చెబుతున్నారంటూ రాజకీయ, మీడియా వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఓటర్లు అలా డబ్బులు డిమాండ్ చేసే స్థాయికి రాజకీయాన్ని దిగజార్చేసింది రాజకీయ పార్టీలే. ప్రధానంగా హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఓటు తాలూకు రేటుని గణనీయంగా పెంచేశాయి రాజకీయ పార్టీలు. దాంతో, సహజంగానే అక్కడి పరిస్థితుల ప్రభావం మునుగోడుపై గట్టిగా పడింది. గట్టిగా ఏడాది అయినా పదవీకాలం వుంటుందో లేదో తెలియదిప్పడు ఎన్నికయ్యే ఎమ్మెల్యే పరిస్థితి.
ఒకవేళ ముఖ్యమంత్రి కేసీయార్ గనుక ముందస్తు ఎన్నికలకు వెళితే, రేపో మాపో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగొచ్చు. అదే జరిగితే, ఇప్పుడు గెలిచే మునుగోడు ఎమ్మెల్యే.. జస్ట్ కొద్ది రోజులు లేదా నెలల వ్యవధిలో పదవి కోల్పోతాడు. ఈ విషయమై జనాలు కూడా గట్టిగానే చర్చించుకుంటున్నారు. ‘అయితే, మాకేంటి.?’ అని కొందరు ఓటర్లు నిలదీస్తున్న వైనాన్ని చూసి అభ్యర్థులు విస్తుపోవాల్సి వస్తోంది.
ఉప ఎన్నిక అంటే అది రాజకీయ పార్టీలకు పెను భారం. ఓటర్లకు పండగ. రాజకీయ అవినీతికి ఈ ఉప ఎన్నికలు కారణమవుతున్నాయన్న విమర్శ లేకపోలేదు. అసలు ప్రజాస్వామ్యం వర్ధిల్లుతోందనడానికి రుజువు ప్రశాంతంగా సాగే ఎన్నికలు. కానీ, ఎన్నికలంటేనే ప్రలోభాలు, హింస.. అన్నట్టు తయారైంది పరిస్థితి.
మునుగోడు ఉప ఎన్నికే కాదు, ప్రతి ఎన్నికా ప్రజాస్వామ్యానికి పాఠం చెబుతుంది. కానీ, ఓటర్లూ నేర్చుకోరు.. రాజకీయ పార్టీలు, నాయకులకూ ఆ అవసరం లేకుండా పోయింది.