Crime News:తల్లి మీద కనికరం చూపని కొడుకులు.. మనస్తాపంతో వృద్ధురాలు ఆత్మహత్యాయత్నం..!

Crime News: ప్రస్తుత కాలంలో పిల్లల్ని కని, పెంచి వారి బాగోగులు చూసుకుని..వారి భవిష్యత్తు కోసం సర్వం త్యాగం చేసిన తల్లిదండ్రులను కడుపున పుట్టిన వారే పట్టించుకోవటం లేదు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి పెళ్లిళ్లు అవగానే తల్లి తండ్రులు బరువైపోతున్నారు. పిల్లల కోసం సర్వం త్యాగం చేసిన తల్లిదండ్రులకు మూడు పూటలా తిండి పెట్టడానికి కూడా పిల్లలకు మనసు రావడం లేదు. అచ్చం ఇలాంటి హృదయవిదారక సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటు చేసుకుంది.

వివరాలలోకి వెళితే..తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా, చౌటుప్పల్ మండలం, జైకేసారాం గ్రామానికి చెందిన బోదాసు స్వామి, ఆండాళు దంపతులకు ఇద్దరు కుమారులు.కుమారులిద్దరికి వివాహం జరగగానే ఎవరు దారి వారు చూసుకున్నారు. అన్న తమ్ముడు ఇద్దరు వేరు వేరు ప్రదేశాలలో ఉండటం వల్ల తల్లి తండ్రుల పోషణ విషయంలో ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉండేవి. ఊరిలో పెద్దమనుషుల చాలా సార్లు సర్ది చెప్పినా కూడా వారి ప్రవర్తనలో మార్పు రాలేదు. కొడుకుల ప్రవతనతో విసుగు చెందిన ఆండాళ్ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది.

కానీ గ్రామస్థుల సలహా మేరకు చౌటుప్పల్ పోలీసులను ఆశ్రయించి తన భాదను చెప్పుకుంది. పోలీసులు తన ఇద్దరి కుమారులను పిలిపించి విచారించారు. పోలీస్ స్టేషన్ లో జరిగిన పరిణామాలతో మనస్థాపం చెందిన ఆండాళ్ పోలీస్ స్టేషన్ బయట ఉన్న చెట్లు చాటుకు వెళ్లి తనతో పాటు తెచ్చుకున్న పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. జూనియర్ సివిల్ న్యాయమూర్తి నాగరాజు బాధితురాలి తో మాట్లాడి వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. బాధితురాలికి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు.