తండ్రి మరణించిన విషయం తెలిసినా కన్న కల కోసం చివరి చూపుకు కూడా రాకుండా ఆస్ట్రేలియాలోనే ఉన్నాడు హైదరాబాదీ క్రికెటర్ సిరాజ్. ఆటోవాలా కొడుకు నుండి ఇప్పుడు అంతర్జాతీయ క్రికెటర్‌గా ఎదిగిన సిరాజ్ ప్రస్థానం అద్భుతం. ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన, ఇండియా తరపున వన్డేలు, టీ 20లు ఆడినా కూడా పెద్దగా రాని గుర్తింపు ఇప్పుడు ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్‌తో సంపాదించాడు. సీనియర్ బౌలర్స్ గైర్హాజరులో ఉన్న సమయంలో ఆ బాధ్యతను తీసుకున్న సిరాజ్ మూడు మ్యాచ్‌లలో 13 వికెట్స్ తీసి భళా అనిపించాడు.
ఆసీస్ గడ్డపై నిప్పులు చెరిగే బంతులు విసరుతూ కంగారూలను కంగారెత్తించాడు. ఓ మ్యాచ్‌లో ఐదు వికెట్స్ తీసిన సిరాజ్ కెరీర్‌లో తొలిసారి ఫైవ్ వికెట్ హాల్‌లో చేరాడు. తండ్రి మరణించిన బాధని మనసులోనే ఉంచుకొని అద్భుత ప్రదర్శనతో కీలక ఆటగాడిగా మారాడు. సిరాజ్ ప్రదర్శనపై ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తుంది. టెస్ట్ సిరీస్ ముగిసిన తర్వాత శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో అడుగుపెట్టిన సిరాజ్ అక్కడి నుండి డైరెక్ట్‌గా తన తండ్రి సమాధి వద్దకు చేరుకొని నివాళులు అర్పించాడు. ఆడిన మ్యాచ్‌లలో వికెట్ పడిన ప్రతీసారి ఆకాశం వైపు చూసి తండ్రికి ఘన నివాళులు అర్పించాడు.
తాజాగా సిరాజ్ ఖరీదైన బీఎండబ్ల్యూ కారు కొనుగోలు చేశాడు. ఇందుకుగాను నెటిజన్స్ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. జీవితంలో మరింత ఎదగాలి అని కామెంట్స్ పెడుతున్నారు. 2019లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌తో వన్డే ఆరంగేట్రం చేసిన సిరాజ్ దేశవాళీ మ్యాచ్‌లు, టీ 20లు ఆడాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఐపీఎల్‌లో ఆడి అదరగొడుతూ వచ్చాడు. సిరాజ్ ఇప్పటివరకు భారత్ తరఫున ఒక వన్డే, మూడు టీ20లు, మూడు టెస్టులు ఆడాడు. టెస్టుల్లో 13, టీ20ల్లో 3 వికెట్లు పడగొట్టాడు. లక్ష్మణ్ తర్వాత టెస్ట్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన క్రికెటర్ మొహ్మద్ సిరాజ్ కావడం విశేషం.