Siraj: దుమ్ము రేపుతున్న సిరాజ్.. రికార్డు సృష్టించిన టీమిండియా బౌలర్..!

టీమిండియా బౌలర్ మహమద్ సిరాజ్ దుమ్ము రేపుతున్నాడు. ఒక్కో మ్యాచ్‌లో ఒక్కో మైలురాయిని అధిగమిస్తూ టీమిండియా బౌలింగ్‌ దళానికి నాయకుడిలా నిలుస్తున్నాడు. వెస్టిండీస్ (West Indies)తో జరుగుతున్న రెండో టెస్టులో మరోసారి తన వేగం, కచ్చితత్వంతో ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టాడు. ఈ మ్యాచ్‌లో కీలక సమయాల్లో వికెట్లు తీసి, టీమిండియాను ముందుడి నడిపించాడు. ముఖ్యంగా షాయ్ హోప్ వికెట్ తీసి అతని కెరీర్‌లో మరో రికార్డు క్రియేట్ చేసుకున్నాడు.

ఈ ఏడాది టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా సిరాజ్ సత్తాచాటాడు. ఇప్పటివరకు జరిగిన ఎనిమిది టెస్టుల్లో అతను 37 వికెట్లు పడగొట్టి అగ్రస్థానంలో నిలిచాడు. రెండో టెస్టు ప్రారంభానికి ముందు Blessing Muzarabani 36 వికెట్లతో టాప్ పొజిషన్‌లో ఉన్నాడు. అయితే హోప్‌ను అవుట్ చేయడంతో సిరాజ్ అతన్ని వెనక్కి నెట్టేశాడు.

262.3 ఓవర్లలో సిరాజ్ మొత్తం 996 పరుగులు ఇచ్చి 3.79 ఎకానమీతో బౌలింగ్ చేశాడు. ఈ ఓవర్లలో 39 ఓవర్లు మెయిడెన్‌గా ఉండటం అతని కచ్చితమైన లైన్, లెంగ్త్‌కు నిదర్శనం. రెండుసార్లు ఐదు వికెట్లు, రెండుసార్లు నాలుగు వికెట్ల ప్రదర్శనతో అతను టీమిండియా పేస్ దళంలో అగ్రస్థానాన్ని మరింత బలపరిచాడు. ప్రత్యేకంగా వెస్టిండీస్ సిరీస్‌లో అతని బౌలింగ్ అద్బుతంగా ఉంది. సిరాజ్ లైన్, లెంగ్త్‌ను చివరి వరకు కట్టుదిట్టంగా కొనసాగించడం వల్లే అతని గణాంకాలు అద్భుతంగా ఉన్నాయని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.

టెస్టు క్రికెట్‌లో తన ప్రభావాన్ని చూపిస్తూ సిరాజ్ టీమిండియా పేస్‌ విభాగానికి బలాన్ని అందిస్తున్నాడు. మరోవైపు అతని ఈ ప్రదర్శన రాబోయే సిరీస్‌లలో కూడా అభిమానుల్లో భారీ అంచనాలను పెంచుతోంది. దేశీయ క్రికెట్‌ నుంచి అంతర్జాతీయ వేదికపైకి వచ్చిన ఈ హైదరాబాది పేసర్ ఇప్పుడు ప్రపంచ బౌలర్ల జాబితాలో అగ్రగామిగా వెలుగొందుతున్నాడు. కెరీర్ ప్రారంభంలోనే ఈ స్థాయి స్థిరత్వాన్ని సాధించిన సిరాజ్‌.. టీమిండియాకు వచ్చే దశాబ్దానికి పేస్‌ డిపార్ట్‌మెంట్‌ను మోసే ప్రధాన శక్తిగా మారే అవకాశముంది.