మోడీ హైద్రాబాద్‌కి.. కేసీయార్ బెంగళూరుకి.!

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైద్రాబాద్ వస్తున్నారు.. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బెంగళూరుకి వెళుతున్నారు. ఇద్దరి మధ్యా గత కొంతకాలంగా అస్సలు పొసగడంలేదన్నది ఓపెన్ సీక్రెట్. రాజకీయ వ్యవహారాలు వేరు, ప్రభుత్వ పరమైన ప్రోటోకాల్స్ వేరు.

తెలంగాణ రాష్ట్రానికి ప్రధాన మంత్రి అధికారిక పర్యటన నిమిత్తం వస్తున్నారంటే, ముఖ్యమంత్రి సాదరంగా ఆహ్వానం పలకాలి. అది తెలంగాణ రాష్ట్రానికి గౌరవం. అది తెలంగాణ రాష్ట్రం తాలూకు బాధ్యత కూడా. కానీ, గత కొంతకాలంగా ప్రధాని నరేంద్ర మోడీ మీద తీవ్రమైన రాజకీయ విమర్శలు చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్, ప్రధాని అధికారిక పర్యటనల్ని సైతం రాజకీయ కోణంలోనే చూస్తున్నట్టున్నారు.

కొన్నాళ్ళ క్రితం ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చారు.. అది కూడా, తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితమైన సమతా మూర్తి విగ్రహావిష్కరణ కోసం. ఆ కార్యక్రమానికి కేసీయార్ కూడా హాజరవుతారని అంతా అనుకున్నారుగానీ, కేసీయార్ మాత్రం ప్రధాని పర్యటనకు దూరంగా వున్నారు. ఆ కార్యక్రమానికి దూరంగా వుండాలని సీఎంవో కార్యాలయానికి, పీఎంవో కార్యాలయం సమాచారం ఇచ్చిందన్నది తెలంగాణ రాష్ట్ర సమితి ఆరోపణ. అలాంటిదేమీ లేదని భారతీయ జనతా పార్టీ ఎదురుదాడికి దిగింది కూడా.

మరి, ఇప్పుడు ఏ అడ్డంకి వచ్చిందని కేసీయార్, ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనకు దూరంగా వుంటున్నట్టు.? జాతీయ స్థాయి రాజకీయాల్లో చక్రం తిప్పే క్రమంలో వివిధ రాష్ట్రాల్లోని ప్రధాన రాజకీయ పార్టీలతో మంతనాలు జరుపుతోన్న కేసీయార్, ఈ క్రమంలోనే బెంగళూరు పర్యటన పెట్టుకున్నారు.

ప్రధాని మోడీ హైద్రాబాద్ వస్తోంటే, కేసీయార్ కర్నాటక రాజధాని బెంగళూరు వెళ్ళడమేంటి.? అన్నది సహజంగానే తలెత్తే ప్రశ్న. ప్రధాని పర్కటనకు డుమ్మా కొట్టేందుకే కేసీయార్ ఇలా ఆల్టర్‌నేటివ్ ప్లాన్స్ వేసుకున్నారన్నది బహిరంగ రహస్యం. అంతలా ప్రధానికీ, ముఖ్యమంత్రికీ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ పెరగడం ఎంతవరకు సబబు.?