ప్రస్తుతం టీడీపీ ఏపీలో బలహీనంగా ఉన్న మాట వాస్తవం. కానీ క్షేత్ర స్థాయిలో టీడీపీకి ఉన్న బలం చాలా ప్రత్యేకమైనది. దశాబ్ధాల క్రితమే ఆ పార్టీకి గ్రామ గ్రామాన బలమైన పునాదులు పడ్డాయి అన్న విషయాన్ని విస్మరిస్తే అవివేకమే అవుతుంది. అదీ అధినేత చంద్రబాబు నాయుడ్ని, పసుపు దళాన్ని అంత తక్కువగా అంచనా వేయడానికి ఎంత మాత్రం వీలు లేదు. రాజకీయ సంక్షోభంలోనూ ఎత్తుకు పై ఎత్తులు వేయడం..వ్యూహాలు పన్నడంలో చంద్రబాబును కొట్టే నాయకుడు ఇంకా ఏపీలో పుట్టలేదు. వెనుక మహానేత ఎన్టీఆర్ ఉన్నారు? అన్న విషయాన్ని విస్మరించడానికి ఎంత మాత్రం ఆస్కారం లేదు. టీడీపీ కి పునాది పడ్డ నాటి నుంచి 2019 ఎన్నికల వరకూ ఎన్నో సంక్షోభాలను ఎదుర్కుని నిలబడిన పార్టీ అది.
నిర్మాణాత్మకంగా టీడీపీ చాలా బలమైన పార్టీ. ఎన్టీరామారావు కూడా లేనప్పుడూ మనుగడ సాధిస్తున్న పార్టీ. పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో రెండు సంక్షోభాలని టీడీపీ ఎదుర్కుంది. టీడీపీ పుట్టిన వెంటనే నాదెండ్ల భాస్కరరావు తిరుగుబాటు. ఆ తర్వాత పీవీ టీడీపీ పార్లమెంటరీ పార్టీని నిట్ట నిలువునా చీల్చారు. ఆ రెండు సంక్షోభాలు రామారావు నాయకత్వంలోనే టీడీపీ ఎదుర్కుంది ఆ తర్వాత చంద్రబాబు అధికారంలోకి వచ్చాక 2004 లో ఘోరంగా ఓడిపోయింది. పదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉంది. ఆపై వైఎస్సార్ దాడిని సైతం ఎదుర్కుని నిలబడగలిగింది. ఇక 2012-2014 మధ్య వరకూ రెండు తీవ్రమైన ఎదురు దాడులు టీడీపీ ఎదుర్కుంది. ఆ సమయంలో జగన్ కి అనుకూలంగా వెళ్తోన్న సానుభూతి వెల్లువ. కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా జగన్ కి మద్దతివ్వడం..అప్పుడే రాజీనామా చేసి ఉప ఉన్నికకు వెళ్తే టీడీపీకి డిపాజిట్లు కూడా రాలేదు.
ఇక తెలంగాణ ఉద్యమంలో టీడీపీ ఇంకా తీవ్రమైన ఇబ్బందిని ఎదుర్కుంది. తెలంగాణలోనూ ఏపీలోనూ టీడీపీ పార్టీని నిలబెట్టుకోవడానికి రెండు కళ్ల సిద్ధాంతం అన్న విమర్శల్ని కూడా ఎదుర్కుంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా 2014 లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఇది టీడీపీకి ఉన్న బలం. 2019 లో టీడీపీ ఓడిపోవచ్చు. 23 సీట్లే రావొచ్చు. ప్రస్తుతం 20 మంది ఎమ్మెల్యేలే చేతిలో ఉండొచ్చు. ఆ సంఖ తగ్గనూ వచ్చు. కానీ ఏడాదిగా జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు ముప్పు తిప్పులు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించాడు అన్నది మర్చిపోలేని అంశం. అధికారం జగన్ చేతిలో ఉన్నా పాలన చంద్రబాబు చేతిలో ఉన్నట్లు చట్టంలో ఉన్న లొసుగుల్ని వాడుకుని చక్రం తిప్పుతున్నారు.
రాజధాని విషయంలోనూ చంద్రబాబు ఇప్పటికీ జగన్ కి చుక్కలు చూపిస్తున్నాడు అన్నది చూస్తూనే ఉన్నాం. అయితే అలాంటి నేత, అలాంటి బలమైన పార్టీపైనా బీజేపీ శూన్యత ఏర్పడిందనడం హాస్యాస్పదంగానే ఉంది. పార్టీ ప్రస్తుతం పరిస్థిని బట్టి అలా వ్యాఖ్యానించిందా? మిత్రపక్షం జనసేన తోడుందని నమ్మకమా? అన్నది పక్కనబెడితే.. అసలు బీజేపీ ఇప్పటివరకూ ఏపీలో సాధించిందేంటి? 2019 ఎన్నికల్లో బీజేపీకి 1 శాతం ఓట్లు కూడా రాలేదు. కానీ టీటీపీ కి 40 శాతం ఓట్లు పడ్డాయి. పోనీ టీడీపీ నుంచి తాజా పరిస్థితుల నేపథ్యంలో భాజాపాలోకి భారీగా వలసలు జరిగాయా? అంటే అదీ జరగలేదు. ఇద్దరు, ముగ్గురు నాయకులు వెళ్లేసరికి బీజేపీ ఓవర్ కాన్పిడెన్స్ తోనే ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఉంది. దీనికి టీడీపీ టోటల్ క్లోజ్ అనడం..ఢీల్లి నుంచి మోడీ ఆడర్స్ అనడం ఇంతకు మించి కామెడీ లేదు.