Narendra Modi : నరేంద్ర మోడీ ‘విభజన’ ఆవేదన: కేసీయార్ వ్యూహం ఫలించిందా.?

Narendra Modi : రాజ్యాంగాన్ని మార్చాలి.. కొత్త రాజ్యాంగం రాసుకోవాలి.. ఈ విషయమై చర్చ జరగాలి..’ అంటూ మొన్నీమధ్యనే తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మీడియా ముందుకొచ్చి తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే.

ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజన దగ్గర్నుంచి, చాలా అంశాలపై కేసీయార్ మాట్లాడారు. కేంద్రం, రాష్ట్రాలపై చెలాయిస్తున్న పెత్తనం గురించి ప్రస్తావించారు. ప్రధానంగా నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తూ కేసీయార్ చాలా చాలా వ్యాఖ్యలు చేశారు. వాటిల్లో కొన్ని ‘హద్దులు మీరి వున్నాయ్’ అనే విమర్శలు బీజేపీ నుంచి వచ్చాయి కూడా.

‘కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని దించేస్తాం. ఈ విషయమై ఏం చేయాలో ఆలోచిస్తున్నాం..’ అంటూ కేసీయార్ వ్యాఖ్యానించిన విషయం విదితమే. ఇలా కేసీయార్ ఉగ్రరూపం చూపించిన కొద్ది రోజులకే, ప్రధాని నరేంద్ర మోడీ.. పార్లమెంటు సాక్షిగా ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజన అంశాన్ని ప్రస్తావిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ పార్టీని విమర్శించే క్రమంలో ఉమ్మడి తెలుగు రాష్ట్ర విభజన అంశాన్ని మోడీ ప్రస్తావించి వుంటారుగానీ, తెలుగు రాష్ట్రాల పట్ల కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి వుందని అనుకోలేం.
కారణం ఏదైతేనేం, మోడీ అలా మాట్లాడటం ఒకరకంగా తెలంగాణ రాష్ట్ర సమితికి కలిసొచ్చే అంశమే. విభజన చట్టంలోని చాలా అంశాలు ఇప్పటికీ పరిష్కారం కాకపోవడాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి తప్పు పడుతోంది. మరోపక్క, పోలవరం ముంపు మండలాల పేరుతో తెలంగాణ భూభాగాన్ని ఆంధ్రప్రదేశ్‌లో మోడీ సర్కార్ కలపడాన్నీ టీఆర్ఎస్ ప్రస్తావిస్తూ విమర్శిస్తోంది.

దాంతో, బీజేపీ తెలంగాణలో ఇరకాటంలో పడిన మాట వాస్తవం. కేసీయార్ బడ్జెట్ విషయమై గట్టిగా నిలదీస్తే, ఆ ఎఫెక్ట్.. ఇదిగో ఇలా బీజేపీ కొంప ముంచేలా చేసిందన్నమాట.