కలెక్టర్ ను బదిలీ చేయించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే

అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం ఎప్పుడూ కుదరదు. చాలా సార్లు ప్రజాప్రతినిధుల మాటే నెగ్గి అధికారులు బదిలీ అవుతుంటారు. జయంశంకర్ భూపాలపల్లిలో ఇప్పుడు ఇదే జరిగింది. స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి ఒత్తిడితో జిల్లా కలెక్టర్ ను బదిలీ చేశారని ఇప్పుడు స్థానికంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. స్థానికంగా చోటు చేసుకున్న పరిణామాలతో  రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే కలెక్టర్‌ బదిలీ జరిగిందని రుజువు అవుతోంది. కలెక్టర్‌ బదిలీ తర్వాత అధికార పార్టీ నాయకులు స్వీట్లు పంచుకున్నారట. సంబరాలు జరుపుకున్నారట. జిల్లా కలెక్టర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ అజీమ్‌ ను ఆకస్మిక బదిలీ చేసి ములుగు కలెక్టర్‌ కృష్ణ ఆదిత్యకు అదనపు బాధ్యతలు అప్పగించింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన 9 నెలల 5 రోజులకే బదిలీ కావడానికి ఇప్పుడు స్థానికంగా చర్చకు దారితీసింది.

కలెక్టర్‌ బదిలీ వెనక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఉన్నారని ప్రచారం జరుగుతోంది.  కలెక్టర్‌ కు ఎమ్మెల్యేతోపాటు పలువురు అధికార పార్టీ నేతలతో అస్సలు పొసగలేదట. నిధుల విడుదల, రికవరి ఇరు వర్గాల మధ్య అగ్గిరాజేసిందట. కాంట్రాక్టర్లపై కలెక్టర్ కఠినంగా వ్యవహరించారట. ఇదే అజీమ్‌ బదిలీకి కారణమైందట.

అయితే గత ఏడాదిగా జిల్లాకు ఎస్పీ లేరు. ఇప్పుడు కలెక్టర్ కూడా బదిలీ కావడంతో పాలనా యంత్రాంగం గాడితప్పుతుందని పులువురు అభిప్రాయపడుతున్నారు. మైనింగ్‌తోపాటు అటవీ ప్రాంతం ఎక్కువగా ఉన్న జిల్లా కావడంతో సహజంగానే ఇక్కడ అధికార పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరు ఎక్కువట. అధికారులు ఒకరితో సన్నిహితంగా ఉంటే మరో వర్గం ఊరుకోదట. స్థానికంగా నెలకొన్న రాజకీయ ఒత్తిడుల కారణంగా భూపాలపల్లిలో పోస్టింగ్‌ అంటేనే అధికారులు హడలిపోయే దుస్థితి నెలకొందని సమాచారం.