కళ తప్పిన కళా వెంకట్రావు

రాజకీయ నాయకులకు అధికారం ఉంటే చాలు అదో రకమైన జోష్ వచ్చేసుంది. పదవి పోతే రిటైర్డ్ అయిపోయామన్న భావనతో రిలాక్స్ అయిపోతారు. అప్పటి వరకు అన్ని పట్టించుకున్న నేతలు ఒక్కసారిగా ఏదీ పట్టించుకోవడం మానేస్తారు. ఏపీ టీడీపీ మాజీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకటరావుది కూడా ఇదే తీరు. దివంగత ఎర్రన్నాయుడితో పోటీ పడ్డ ఈనేత ఆయన కంటే ఎక్కువ పదవులే పొందారు. యుక్త వయసులోనే  హోం మంత్రి అయ్యారు. ఆతర్వాత ఎన్నో పదువులు ఈయన్ని వరించాయి.  అయితే కిందటి  ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయిన తర్వాత పూర్తిగా సైలెంట్ అయిపోయారు. మాటా మంతీ లేకుండా, గమ్మున ఉండిపోతున్నారు.

ఇద్దరు టీడీపీలోనే ఉన్నా కింజరాపు కుటుంబానికి, కళా వెంకటరావు కు ఎపుడూ పొసగదు. కళా వెంకటరావు దగ్గుబాటి గ్రూప్ అయితే, ఎర్రన్నాయుడిది చంద్రబాబు గ్రూప్. దీంతో ఆతర్వాత ఎర్రన్నాయుడి హవా కొనసాగింది. ఇక ఇప్పుడు కింజరాపు అచ్చెన్నాయుడిని చంద్రబాబు పార్టీ అధ్యక్షుడిని చేశారు. ఇదే కుటుంబానికి చెందిన రామ్మోహననాయుడు శ్రీకాకుళం ఎంపీ, ఎర్రన్నాయుడి కూతురు రాజమండ్రి నుంచి ఎమ్మెల్యే. ఇలా కింజరపు కుటుంబం ఏపీ రాజకీయాల్లో తమదైన పట్టుసాధించింది. దీంతో కళా వెంకట్రావు మరింత సైలెంట్ అయిపోయారు. తను ఓడిపోవడంతో పాటు తన వైరి వర్గం రాజకీయంగా బాగా ఎదగడంతో మిన్నకుండిపోవడమే మంచిదనే అభిప్రాయానికి వచ్చేశారు.

గతంలో టీడీపీ నుంచి స్పీకర్ తమ్మినేని సీతారాంతో కలిసి ప్రజారాజ్యంలో చేరిన కళా వెంకట్రావు, అక్కడి నుంచి మళ్లీ టీడీపీ గూటికి చేరుకున్నారు. తమ్మినేని మాత్రం వైసీపీలో చేరి స్పీకర్ అయ్యారు. అయితే ఇప్పుడు టీడీపీలో తన వైరి వర్గం హవా బాగా నడుస్తుండడంతో ఎందుకైనా మంచిదని టీడీపీకి దూరంగా ఉంటూ వైసీపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం. ఇందు కోసం స్పీకర్ తమ్మినేని సీతారం లాబీయింగ్ చేస్తున్నారని సమాచారం. వీరిద్ధరు కింజరాపు కుటుంబానికి వ్యతిరేకులే కావడంతో వీరిద్ధరి మధ్య స్నేహం బాగా వికసించింది. మరో చంద్రబాబు కూడా కళా వెంకట్రావును లైట్ తీసుకుంటుండడంతో ఆయన వైసీపీ వైపు ఆసక్తి కనబరుస్తున్నారన సమాచారం.