బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రారావు ఓయూ చేరుకున్నా..మీరెక్కడా అంటూ..కేటీఆర్ కు రామచంద్రారావు ట్వీట్ చేశారు. ఉద్యోగాల కల్పనపై ఉస్మానియాలో యూనివర్శిటీలో చర్చకు రావాలని మంత్రి కేటీఆర్‌కు ఛాలెంజ్ చేశారు. అన్న మాట ప్రకారం ఎమ్మెల్సీ ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్దకు చేరుకున్నారు. నిరుద్యోగ భృతిని కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ రామచంద్రరావు. కేటీఆర్ అవాస్తవాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఆర్ట్స్ కాలేజీ వద్దకు చేరుకున్న ఎమ్మెల్సీ కేటీఆర్ ఎక్కడున్నావ్ ? అంటూ సోషల్ మీడియాలో పోస్టు కూడా పెట్టారు.
దీనిపై మంత్రి సోషల్ మీడియా ద్వారా రిప్లై ఇచ్చారు. ‘నేను ఓయూ ఆర్ట్స్ కాలేజీలో ఉన్నాను. నువ్వెక్కడ ’ అంటూ ఎమ్మెల్సీ చేసిన ట్వీట్‌కు కేటీఆర్ బదులిచ్చారు. ‘ప్రధాని మోదీ ఇచ్చిన 12 కోట్ల ఉద్యోగాలు (సంవత్సరానికి రెండు కోట్లు), జన్ ధన్ ఖాతాల్లో జమ చేసిన రూ. 15 లక్షలకి సంబంధించిన సమాచారం సేకరించడంలో బిజీగా ఉన్నానంటూ’ సమాధానం ఇచ్చారు. దీంతో పాటు NDA- నో డాటా ఎవైలబుల్ అంటూ ట్వీట్ చేస్తూ చురకలంటించారు.
దీనికి సంబంధించి మీ దగ్గర ఏమైనా సమాచారం ఉంటే షేర్ చేయండి అంటూ కూడా కోరారు కేటీఆర్. స్వరాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక రికార్డు స్థాయిలో ఉద్యోగాలు కల్పించామన్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కంటే.. తెలంగాణ ప్రభుత్వమే ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిందన్నారు. తెలంగాణ వచ్చాక లక్షా 32 వేల 799 ఉద్యోగాలను ఇచ్చామని, ఈ విషయంపై ఎక్కడైనా చర్చకు సిద్ధంగా ఉన్నట్టు కేటీఆర్ విసిరిన సవాల్‌తో దుమారం రేగింది.