మహిళలకు మెప్మా ఆర్పీల బెదిరింపులు.. డబ్బులు నిలిపివేస్తామంటూ!

ప్రకాశం జిల్లా మార్కాపురంలో నిన్న పురపాలకశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ సున్నా వడ్డీ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటలకు సభ ప్రారంభం కావాల్సి ఉండగా మధ్యాహ్నం రెండు గంటలైనా మంత్రి జాడ లేకపోవడంతో విసిగిపోయిన మహిళల్లో కొందరు సభ నుంచి బయటకు వెళ్లిపోతుండగా గమనించిన మెప్మా ఆర్పీలు వారిని అడ్డుకున్నారు.

సభ నుంచి వెళ్లిపోతే వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం డబ్బులు నిలిపేస్తామని, సంఘాల నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. కాదని వెళ్తే పథకం డబ్బులు ఆపేస్తామని, బ్యాంకు రుణాలు రాకుండా చేస్తామని బెదిరించారు. దీంతో వారి మధ్య వాగ్వివాదం జరిగింది. వారి బెదిరింపులకు లొంగని మహిళలు మీ ఇష్టం వచ్చింది చేసుకోమంటూ వెళ్లిపోయారు.

అదే సమయంలో మంత్రి వస్తుండడంతో మెప్మా పీడీ రవికుమార్ వెళ్లిపోతున్న మహిళల వద్దకు వెళ్లి మంత్రి వస్తున్నారని, సభకు రావాలని కోరారు. అయినప్పటికీ మహిళలు వెనక్కి వచ్చేందుకు నిరాకరించారు. 2.15 గంటలకు మంత్రి రావడంతో కార్యక్రమం ప్రారంభమైంది.