Mental Heroine : మెగా ఛాన్స్ కొట్టేసిన ‘మెంటల్’ పోరీ.!

Mental Heroine

Mental Heroine : ‘మెంటల్ మదిలో‘ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ నివేదా పేతురాజ్. తొలి సినిమా అమ్మడికి మంచి పేరు తీసుకొచ్చింది. కానీ, తెలుగులో తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు. దాంతో కోలీవుడ్‌లో లక్కు టెస్టు చేసుకుంది.

అక్కడ విజయ్ ఆంటోనీతో ‘రాక్షసుడు’ తదితర సినిమాల్లో నటించి, తమిళ తంబీల మెప్పు పొందింది. ఆ తర్వాత మళ్లీ తెలుగు తెరపైనా సత్తా చాటుతోంది. ‘చిత్రలహరి’ సినిమాలో నివేదా పేతురాజ్ నటనకు మంచి మార్కులు పడ్డాయ్. విశ్వక్‌సేన్‌ సరసన ‘పాగల్’ సినిమాలో లీడ్ రోల్ పోషించింది నివేదా.

రామ్ సినిమా ‘రెడ్’‌లో పోలీసాఫీసర్‌గా కనిపించి మెప్పించింది. ‘అల వైకుంఠపురములో’ సుశాంత్ లవర్‌గా హాట్ అప్పియరెన్స్‌తో షాకిచ్చింది. మధ్య మధ్యలో కొన్ని తమిళ సినిమాలనూ బ్యాలెన్స్ చేస్తూ వస్తోంది నివేదా పేతురాజ్. అలాగే, నెట్టింట్లోనూ ఫుల్ యాక్టివ్‌గా వుంటోందీ ‘మెంటల్’ భామ.

ఇదిలా వుంటే, లేటెస్టుగా ఓ మెగా ఆఫర్ నివేదా తలుపు తట్టినట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమాలో నివేదా పేతురాజ్ చోటు దక్కించుకుందట. పాత్ర నిడివి తక్కువే కానీ, మెగాస్టార్ సినిమాలో ఛాన్స్ అంటే పండగే కదా. అందుకే తెగ మురిసిపోతోందీ ముద్దుగుమ్మ. బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమా ఇది.

ఈ సినిమాలో మాస్ రాజా రవితేజ స్పెషల్ క్యారెక్టర్‌లో కనిపించనున్నాడు. రవితేజతో నివేదా పాత్ర జత కట్టనున్నట్లు తెలుస్తోంది. చిరంజీవికి జోడీగా శ్రుతిహాసన్ నటిస్తోన్న సంగతి తెలిసిందే, ‘వాల్తేర్ వీర్రాజు’ అనే టైటిల్‌ని ఈ సినిమాకి పరిశీలిస్తున్నారు.