ఈటెల రాజేందర్ తర్వాత ఎవరు.? అన్న చర్చ తెలంగాణ రాష్ట్ర సమితిలో జోరుగా వినిపిస్తోంది. మీడియాలో వినిపిస్తున్న ఊహాగానాల ప్రకారం మంత్రి జగదీష్ రెడ్డి పేరు బాగా ప్రచారంలోకి వచ్చిందని అనుకోవాలేమో. రేపో మాపో ఆయనకీ ‘ఊస్టింగ్’ తప్పదంటూ రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఈ విషయాన్ని కాంగ్రెస్ నేత, ఎంపీ రేవంత్ రెడ్డి సెటైరికల్ కోణంలో ట్వీటేయడం గమనార్హం. జగదీష్ రెడ్డి అలాగే రసమయి బాలకిషన్.. ఇలా కొందరి పేర్లు మీడియాలో నానుతున్నాయి.. వీళ్ళంతా తెలంగాణ రాష్ట్ర సమితికి గుడ్ బై చెప్పబోతున్నారని.
కొన్నాళ్ళ క్రితం ‘కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్..’ అంటూ ప్రచారం జరిగిన దరిమిలా, అప్పుడు కొందరు గులాబీ నేతలు, కేటీఆర్ మీద మమకారంతో ఆయనకు మద్దతు పలికితే, ఇంకొందరు కేసీఆర్ మీద వ్యతిరేకతతో కేటీఆర్ మీద అమితమైన అభిమానాన్ని ఒలకబోసేశారు.
ఈ వ్యవహారం కేసీఆర్ మదిలో ఓ బలమైన ముద్ర వేసేసింది. అప్పట్లోనే అందరికీ ఓ వార్నింగ్ కూడా కేసీఆర్ ఇచ్చేశారనే ప్రచారం జరిగింది. అప్పటినుంచే లెక్కలు తీసిన కేసీఆర్, పార్టీకి సమీప భవిష్యత్తులో ఫలానా నేతలు దెబ్బకొట్టే అవకాశం వుందని కొందరి పేర్లను ‘టిక్’ చేశారనీ, అందులోంచే ఈటెల రాజేందర్ పేరు ముందుగా తెరపైకి తెచ్చి, బయటకు పంపేశారని గులాబీ వర్గాల్లోనూ గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే, ఈటెల రాజేందర్ విషయంలో జరిగినట్లు, ఇంకెవరి విషయంలోనూ జరగదని గులాబీ నేతలు పైకి బలంగా చెబుతున్నారు.
ఈటెల వ్యవహారాన్ని దేనితోనూ ముడిపెట్టకూడదట. పార్టీలో ఇప్పుడంతా కేసీఆర్ విధేయులే వున్నారట. జగదీష్ రెడ్డి విషయంలో జరుగుతున్నదంతా దుష్ప్రాచరమేనట. ఏమో, రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. ఇప్పుడిలా.. రేప్పొద్దున్న ఈక్వేషన్ ఎలా మారిపోతుందో ఏమో.!