Masala Jaggery Tea: ఇంకొన్ని రోజులలో రాబోతుంది శీతాకాలం. చలి ఎంతగా హింసిస్తున్నా… వేకువ జామున మంచు పొరలతో కప్పుకుని ఉండే వాతావరణాన్ని చూస్తుంటే ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. చల్లని గాలుల వలన శరీరం కోరే ప్రతి వస్తువు వెచ్చగా ఉండాలని కోరుకుంటుంది. చలిని తట్టుకోటానికి శరీరం దుప్పటితో సహవాసం చేస్తే… మనసేమో వేడి టీతో సేద తీరుతుంది. అంతేకాదండోయ్… శీతాకాలం దగ్గు, జలుబు మరియు ఫ్లూ వంటి అనేక ఆరోగ్య సమస్యలను కూడా కలిగిస్తుంది. అందుకే నిపుణులు ఈ సీజన్‌కు అనుకూలంగా మన మొత్తం జీవనశైలిని మార్చుకోవాలని సూచిస్తున్నారు.
ఈ క్రమంలో ఆహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. తాజా కాలానుగుణ కూరగాయల నుండి నువ్వుల గింజలు మరియు వేరుశెనగ వరకు చలికాలంలో తినడానికి అనేక ఆహార ఎంపికలు మన ముందున్నాయి. శీతాకాలానికి అనుకూలమైన మరొక ఆహారం బెల్లం. బెల్లం శీతాకాలపు చలిని తరిమికొట్టడానికి అత్యుత్తమ ఆహారాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇది శరీరంలో వేడిని ఉత్పత్తి చేయడంతో పాటు బయట చల్లని వాతావరణం నుంచి మనల్ని కాపాడుతుంది.
అంతే కాకుండా బెల్లం, చక్కెరకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది. అనేక వంటకాలలో బెల్లం ఉపయోగించటం వలన అవి మరింత పోషకమైన పదార్థాలుగా మారిపోతాయి. హల్వా నుండి లడ్డూ, బర్ఫీ వరకు ప్రతిదానిలో బెల్లాన్ని వాడతారు. అందరికి తెలియని ఒక గమ్మత్తైన విషయం ఏంటంటే… మనం రోజు త్రాగే టీని బెల్లం, మసాలతో చేసుకుంటే అటు రుచికరంగాను ఇటు శీతాకాలానికి అనుకూలంగా ఉంటుంది.
ఈ టీలో ఉపయోగించే లవంగం, దాల్చిన చెక్క, అల్లం వంటివి యాంటీఆక్సిడెంట్లు, యాంటీ-వైరల్ లక్షణాలతో నిండి ఉంటాయి. ఇవి శీతాకాలంలొ వచ్చే జలుబు మరియు ఫ్లూని నిరోధించడంలో సహాయపడతాయి. ఇనుము, ఖనిజాలతో పాటుగా అనేక ముఖ్యమైన పోషకాలతో బెల్లం నిండి ఉంటుంది. ఈ పోషకాలు రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి సహాయపడతాయి.
శీతాకాలంలో మన శరీరం తక్కువ శక్తిని ఖర్చు చేస్తుంది. అందుకే క్యాలరీలను బర్నింగ్ చేయడం అందరికీ కష్టమవుతుంది. అటువంటి పరిస్టితి నుండి బెల్లం మన రక్షణకు ఇస్తుంది. కొద్దీ మొత్తంలో బెల్లాన్ని తింటే అది జీవక్రియకు సహాయపడుతుంది. మసాలా మరియు బెల్లంలోని ముఖ్యమైన పోషకాలు ఆహారాన్ని వేగంగా మరియు సులభంగా జీర్ణం చేయడంలో సహాయపడతాయి. అంతేకాకుండా బరువు తగ్గేందుకు కూడా ప్రోత్సహిస్తుంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం, బెల్లం రక్తాన్ని పలుచగా చేసి శరీరానికి లోపల నుండి మెరుపునిస్తుంది.