‘మా’ ఎలక్షన్ నుండి తప్పుకుంటానని ప్రకటించిన విష్ణు !

Manchu vishnu released a video on MAA Elections

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికలకు సంబంధించి జరుగుతున్న హడావిడి ప్రతి తెలుగు సినీ అభిమానికి తెలిసిందే. ఇంకా మూడు నెలలు సమయం ఉన్నప్పటికీ ఇప్పటినుండే రాజకీయం మొదలెట్టారు. అధ్యక్ష పదవికి ఏకంగా ఐదుగురు అభ్యర్థులు పోటీకి సిద్దమవటంతో ఈ సారి ఎన్నికలు రసవత్తరంగా ఉంటాయని ఒక అంచనాకు వచ్చేసారు. దానిని నిజం చేస్తూ పోటీలో ఉన్న అభ్యర్థులందరూ మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి ఒకరి మీద మరొకరు విమర్శలు చేయటం ప్రారంభించేసారు. కానీ ఈ వ్యవహారమంతా తెలుగు సినీపరిశ్రమకి బాగా డ్యామేజ్ గా మారుతుందని భావించిన సినీ పెద్దలు అధ్యక్షున్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవటమే మంచిదిగా భావిస్తున్నారని సినీ వర్గాలు చెప్తున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా మంచు విష్ణు ఒక వీడియో ద్వారా ‘మా’ అధ్యక్ష ఎన్నికలను ఏకగ్రీవం చేస్తే తాను పోటీ నుంచి తప్పుకుంటానని స్పష్టం చేశారు. ఒకవేళ ఏకగ్రీవం చేయకపోతే తాను పోటీలో కొనసాగుతానని తెలిపారు. అంతేకాకుండా ” ‘మా’ అసోసియేషన్‌లో చిన్న చిన్న తప్పులు జరిగి ఉండొచ్చు, అవి ఉద్దేశ పూర్వకంగా చేసినవి కావని అనుకుంటున్నా. మనం గతాన్ని తవ్వుకోకుండా ముందుకెళ్లి మంచి పనులు ఎలా చేయాలో ఆలోచిద్దాం’’. ‘మా’ అసోసియేషన్‌ కోసం కట్టించబోయే బిల్డింగ్‌ అజెండాగానే ఇప్పటికీ ఎన్నికలు జరుగుతున్నాయి. మా బిల్డింగ్ నిర్మాణానికి అయ్యే ప్రతి పైసా నేను ఇస్తా. నా కుటుంబంతో కలిసి ఆ బిల్డింగ్‌ని నేను నిర్మిస్తానని అన్నారు.

ఇండస్ట్రీలో యూనియన్ మెంబర్‌షిప్‌ ఉన్న వాళ్లే సినిమాల్లో పని చేయాలి, కానీ, ఇక్కడ మెంబర్‌షిప్‌ లేని చాలామంది పనిచేస్తున్నారు. కొత్తవాళ్లని ప్రోత్సహిద్దాం! తప్పులేదు.. కానీ, సినిమాల్లో పని చేస్తున్న ప్రతి ఒక్కరు ‘మా’ సభ్యుడు అవ్వాల్సిందే. నిర్మాతలు లేకపోతే మనం లేం. ఇది ప్రతి నటుడు గుర్తుంచుకోవాల్సిన విషయం. పెద్దలని గౌరవిస్తాను, వారి సలహాలను స్వీకరిస్తాను అని వెల్లడించారు. అయితే చివర్లో “మీరందరూ నన్ను మా ప్రెసిడెంట్ గా ఆశీర్వదిస్తారని” విష్ణు కోరుకోవటం కొసమెరుపు.