రాష్ట్రం విడిపోయి ఇన్నేళ్ళు గడిచినా ఇప్పటికీ రాజధాని విషయంలో ఒక క్లారిటీ లేదు. బహుశా దేశంలో స్పష్టమైన రాజధాని లేకుండా మనుగడ సాగించిన, సాగిస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనేమో. ఇందుకు కారణం రాజకీయం. రెందు రాజకీయ పార్టీల మధ్య నడుస్తున్న పోరాటంలో రాష్ట్రం నష్టపోతోంది. టీడీపీ ఏమో అమరావతిని రాజధానిగా నిర్ణయించి పనులు చేపడితే వైసీపీ అధికారంలోకి రాగానే దాన్ని కాదని అభివృద్ది వికేంద్రీకరణ పేరుతో ప్రధాన రాజధానిని విశాఖకు మార్చాలని డిసైడ్ అయింది. ఎందుకు ఈ మార్పు అంటే అభివృద్ది అన్ని ప్రాంతాలకు సమానంగా ఉండాలని మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నామని అంటున్నారు.
అమరావతి అసలు రాజధానిగా పనికిరాదని వైసీపీ నేతలు అంటుంటే విశాఖ కంటే అమరావతే రాజధానికి అనువైన చోటని టీడీపీ అంటోంది. ఎవరి వెర్షన్లో వాళ్లు విశాఖలోని బెనిఫిట్స్, అమరావతిలో ని అనుకూలతలను చెబుతున్నారు. అవన్నీ పక్కనబెడితే విశాఖకు, అమరావతికి అతిపెద్ద తేడా ఒకటి ఉంది. అదే మంచినీరు. అమరావతి కృష్ణా నది తీరాన ఉంటే విశాఖ సముద్రతీరాన ఉంది. సముద్ర తీరం కంటే నదీ పరివాహక ప్రాంతంలోనే మంచి నీటి సౌకర్యం ఎక్కువ. ఒక్కసారి చరిత్ర చూస్తే ప్రపంచంలో గొప్ప నగరాలుగా విరాజిల్లిన నగరాలన్నీ నదీ తీరాన నిర్మించబడినవే. నది వెంబడి నిర్మితమయ్యే నగరం తప్పకుండా జనావాసానికి అనుకూలంగా ఉండి తీరుతుంది. ప్రధానమైన తాగు, సాగు నీరు పుష్కలంగా లభించడమే అందుకు కారణం.
అందుకే అమరావతి విశాఖ కంటే బెటర్ ఆప్షన్ అంటున్నారు నిపుణులు, మేధావులు. ఇప్పటికే విశాఖ అభివృద్ది చెందిన నగరం. జనాభా ఎక్కువే. అక్కడే పాలన రాజధానిని ఏర్పాటుచేస్తే జనభా రెట్టింపవుతుంది. ఇప్పుడున్న తాగునీటి వనరులు భవిష్యత్తులో పెరగబోయే జనాభాకు చాలవు. తప్పకుండా నీటి సమస్య పీడిస్తుంది. ఇక ప్రకృతి విపత్తులు అమరావతికి ఎక్కువని అంటున్నారు. నది వరదతో అమరావతికి ముంపు తప్పదని కొందరి వాదన. పర్యావరణ నిపుణులు మాత్రం అలాంటిదేం ఉండదని, నగరాన్ని ముంచెత్తే వరదలు రావని, ఇంకా విశాఖకే తుఫానుల ప్రమాదం ఎక్కువని, గతంలో హుద్ హుద్ తుఫాన్ సృష్టించిన భీభత్సాన్ని గుర్తుచేస్తూ విశాఖకు, అమరావతికి గల ప్రధాన తేడాను పూసగుచ్చినట్టు చెబుతున్నారు.