టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి లోకేష్ తప్పుకున్నారని..ఆ బాధ్యతలు ఎంపీ రామ్మోహన్‌నాయుడుకి అదిష్టానం అప్పగించినట్లు కొన్ని ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కి తన కుమారుడి ప్రతిభ గురించి ఇన్నాళ్లకు తెలుసుకుని తప్పిస్తున్నట్లు ట్వీట్లు వచ్చాయి. ఇద్దరి మధ్య ఈ వివాదం చాలా కాలంగా నలుగుతోందని ప్రచారం సాగింది. నారా శకం ముగిసింది..ఇక కింజారపు శకం ప్రారంభం అంటూ ట్వీట్లు వచ్చాయి.
దీంతో రామ్మోహన్‌నాయుడు వెంటనే ట్విటర్ వేదికగా స్పందించారు. అధినాయకత్వం చెప్పకుండానే మీడియాలో కథనాలు రాయడం తగదని.. తమ కుటుంబానికి వేరే అజెండా అంటూ ఏమీ లేదని.. పార్టీ తల్లిలాంటిది.. అధినేత మాటే శిరోధార్యం అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు. దీంతో అవి ఫేక్ ట్వీట్లు అని తేలిపోయింది. తాజాగా వీటిపై లోకేష్ కూడా స్పందించారు. సోషల్ మీడియాలో ఇష్టాను సారం తనపై ట్వీట్లు చేస్తున్నారని మండిపడ్డారు. ఇదంతా వైఎస్సార్ పార్టీ వాళ్లు చేస్తున్న పనే అన్నారు. అన్నదమ్ముల్లా ఉండే రామ్మోహన్ నాయుడు గారికి-నాకు మధ్య గొడవలు పెట్టాలని చూస్తున్నారా? అది ఎప్పటికీ జరగదంటూ మండిపడ్డారు.
ఇలాంటి చిల్లర కామెంట్లు వైకాపా వాళ్లు మానుకోవాలంటూ హితవు పలికారు. పేటీఎమ్ బ్యాచ్ ఆవేశానికి నా సానుభూతి అంటూ వ్యగ్యంగా స్పందించారు. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలు మావైపు ఉన్నారు. మీ వైపు అంతా డబ్బు కోసం పనిచేసేవారు ఉంటారని ఎద్దేవా చేసారు. అయితే లోకేష్ పై ఇలాంటి ట్వీట్లు కొత్తేం కాదు. ఆయనపై గతంలోనూ పలు పేక్ ట్వీట్లు వైరల్ అయ్యాయి. వాటిపైనా లోకేష్ ఇలాగే స్పందించారు. మళ్లీ ఇలాంటి ప్రచారాలకు దిగితే సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి ఉటుందని హెచ్చరించారు. ఇలాంటి అసత్య ప్రచారాలు తమ పార్టీకీగాని, తమ కుటుంబానికి గానీ ఎలాంటి హాని తలపెట్టబోవని వైకాపా వాళ్లు గుర్తు పెట్టుకోవాలని మండిపడ్డారు.