తెలంగాణలో లాక్ డౌన్ ఎత్తివేత: మూడో వేవ్ మాటేమిటి.?

Lockdown completely lifted in Telangana

Lockdown completely lifted in Telangana

తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ పూర్తిగా ఎత్తివేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో లాక్ డౌన్ ఎత్తివేత సహా పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల తీవ్రత తగ్గుతున్న దరిమిలా, ఆర్థిక కార్యకలాపాలు పూర్తిస్థాయిలో జరిగేందుకు వీలుగా లాక్ డౌన్ ఎత్తివేత నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చిన నివేదిక ఆధారంగా లాక్ డౌన్ ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. రేపటినుంచి తెలంగాణలో లాక్ డౌన్ ఆంక్షలు వుండవుగానీ, కరోనా నిబంధనల్ని ప్రతి ఒక్కరూ పాటించాల్సి వుంటుంది.

జులై 1 నుంచి విద్యాసంస్థలన్నీ పూర్తిస్థాయిలో పనిచేయాలని, అందుకు తగ్గ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర క్యాబినెట్, విద్యా శాఖను ఆదేశించింది. అంటే, జులై 1 నుంచి స్కూళ్ళతో సహ విద్యాసంస్థలన్నీ తెరచుకుంటాయన్నమాట. మరి, మూడో వేవ్ సంగతేంటి.? 6 నుంచి 8 వారాల్లోనే మూడో వేవ్ వచ్చే అవకాశం వుందంటూ ఓ పక్క పలు అధ్యయనాలు చెబుతున్న దరిమిలా, డెల్టా వేరియంట్ సహా డెల్టా వేరియంట్ ప్లస్ భయాలు ఇంకా తొలగిపోని ప్రస్తుత పరిస్థితుల్లో లాక్ డౌన్ ఎత్తివేయడం ఎంతవరకు సమంజసం.? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

ప్రతిరోజూ లక్షకు పైగా కరోనా టెస్టులు జరుగుతున్నాయి తెలంగాణలో. దాదాపు 1400 కరోనా పాజిటివ్ కేసులు నిత్యం వెలుగు చూస్తున్నాయి. అంటే, తెలంగాణలో కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదు. లాక్ డౌన్ కారణంగానే కరోనా వైరస్ ప్రస్తుతానికి అదుపులో వుంది. లాక్ డౌన్ ఎత్తివేస్తే అంతే సంగతులు. కానీ, ఎన్నాళ్ళి లాక్ డౌన్ కొనసాగుతుంది.? ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడం, ప్రజా జీవనం సజావుగా సాగడం.. అనే కీలక అంశాల నేపథ్యంలో లాక్ డౌణ్ ఎత్తివేత తప్పడంలేదనుకోవాలేమో. కానీ, లాక్ డౌన్ పూర్తిగా ఎత్తివేయకుండా కొన్ని ఆంక్షలు సడలించి వుంటే బావుండేదేమో.