స్థానిక పోరు: చంద్రబాబు ఈసారైనా నిలబడతారా.?

స్థానిక ఎన్నికలకు సంబంధించి మరో నగారా మోగింది. గతంలో ఎన్నికలు జరగని చోట్ల ఈసారి ఎన్నికలు జరగబోతున్నాయి. నెల్లూరు మునిసిపల్ కార్పొరేషన్ సహా పలు పంచాయితీలకు ఎన్నికలు జరగనున్నాయి. కొన్ని జెడ్పీటీసీ స్థానాలకూ ఎన్నికల నగారా మోగిన దరిమిలా, అధికార వైసీపీలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.

ఇంతకీ, విపక్షాల మాటేమిటి.? మరీ ముఖ్యంగా ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఏం చేయబోతోంది.? ఇదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకాలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ, టీడీపీ.. ఆ మధ్య ఎన్నికల్ని బహిష్కరించిన విషయం విదితమే. మరి, ఇప్పుడు కూడా అదే పద్ధతిని ఫాలో అవుతుందా టీడీపీ.?

ఏమో, చంద్రబాబు రాజకీయ వ్యూహాల్ని చూస్తోంటే, టీడీపీ ఈసారి కూడా బరిలో నిలిచేలా లేదు. ఒకవేళ టీడీపీ గనుక బరిలోకి దిగకపోతే, జనసేనకు ఖచ్చితంగా అది అడ్వాంటేజ్ అవుతుంది. గతంలో నామినేషన్ల సందర్భంగా అక్రమాలు జరిగాయని గగ్గోలు పెట్టిన జనసేన, ఈసారి అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచిదే.

రాజకీయాల్లో గెలుపోటములనేవి సర్వసాధారణం. ఓడినా, పోటీ ఇచ్చామన్న సంతృప్తి రాజకీయ పార్టీలకు వుంటే, భవిష్యత్తులో రాణించడానికి అవకాశం వుంటుంది. నిజానికి, టీడీపీతో పోల్చితే, జనసేన ఇటీవలి కాలంలో బాగానే పుంజుకుంటోంది. అయితే, టీడీపీ నీడ కారణంగా జనసేన ప్రతిసారీ దెబ్బ తింటోంది.

స్థానిక పోరుకి ఇంకో నగారా మోగిన దరిమిలా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గనుక పార్టీ మీద ఈ సమయంలో స్పెషల్ ఫోకస్ పెడితే, ప్రధాన ప్రతిపక్షం జనసేన పార్టీయేనని నిరూపించుకోవడానికి అవకాశం దొరుకుతుంది. మిత్రపక్షం బీజేపీని సైతం ఈసారి జనసేన పక్కన పెడితేనే మంచిదేమో.