విశాఖ ఎల్.జీ పాలిమర్స్ ఘటన దేశాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. ఊపిరాడక ఎక్కడ జనం అక్కడే పిట్టలా రాలిపోయారు. మనషి..జంతువు..పక్షులు..చెట్లు గ్యాస్ ఘాటుకి కకా వికలమైపోయాయి. దీంతో నిన్న ఉదయం నుంచి విశాఖ వాసులు ఒకటే టెన్షన్ లో ఉన్నారు. నిన్న రాత్రి కూడా గ్యాస్ లీక్ అవ్వడంతో దూర ప్రాంతాలకు తరలి వెళ్లే ప్రయత్నం చేసారు. దాదాపు కంపెనీ చుట్టు పక్కల ఐదు గ్రామాల ప్రజల్ని పునరావాస కేంద్రాలకి తరలించి వసతి కల్పించారు. అయితే తాజాగా మరోసారి సమీపంలో ఉన్న ప్రజలు ఉరుకులు…పరుగులు తీస్తున్నట్లు సమాచారం.
ముందు జాగ్రత్తగా కొంత మంది ప్రజలు శ్రీకాకుళం వైపు కార్లు, ద్విచక్ర వాహనాల ద్వారా వైజాగ్ ని వదిలేందుకు బయలు దేరారు. అయితే రణస్థలం కరోనా వైరస్ చెక్ పోస్ట్ వద్ద పోలీసుల్ని వాళ్లని బోర్దర్ దాటకుండా చేస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా అడ్డుకోవాల్సి వస్తోందని పోలీసులు వివరణ ఇచ్చారు. తమకిష్టమైతే క్వారంటైన్ లోకి పంపిస్తామని..లేదంటే తిరిగి వెనక్కి వెళ్లిపోవాలని చెప్పి పంపిస్తున్నారు. లేదంటే పోలీసు ఉన్నత స్థాయి అధికారుల అనుమతి పత్రం ఉంటే వెళ్లనిస్తామని చెబుతున్నారు. అయితే ప్రస్తుతానికి ఎల్ జీ పాలిమర్స్ నుంచి ఎలాంటి గ్యాస్ లీకు లేనప్పటికీ.. ఉన్న గ్యాస్ ను మాత్రం కచ్చితంగా ఉన్న చోట నుంచే బయటకు వదలాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు.
లేదంటే ఒత్తిడి ఎక్కువై పగిలిపోయి పెద్ద విస్ఫోటనానికే దారి తీసే ప్రమాదం ఉందని అంటున్నారు. దానికి తగ్గట్టు ఇప్పటికే గుజరాత్ నుంచి ప్రత్యేక ట్యాంకెర్లు తెప్పించారని గ్యాస్ ని వాటిలోకి డంప్ చేసే ప్రక్రియ కొనసాగుతుందని తెలిసింది. ఆ భయంతో ప్రజలు శ్రీకాకుళం వైపు తరలి వస్తున్నట్లు చెబుతున్నారు. అయితే ప్రభుత్వం ఎలాంటి ప్రమాదం జరగకుండా అన్ని రకాలు చర్యలు తీసుకుందని…ప్రజలెవరు భయపడాల్సిన పనిలేదని ధీమా వ్యక్తం చేసారు.