బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ దిలీప్ కుమార్ ఇక లేరు. 98 ఏళ్ల దిలీప్ కుమార్ ఈరోజు బుధవారం ఆయన తుదిశ్వాస విడిచారు. చాన్నాళ్ళ నుండి ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న దిలీప్ కుమార్ జూన్ 30వ తేదీన శ్వాస సంబంధిత సమస్యలతో ముంబైలోని పీడీ హిందూజా ఆసుపత్రిలో చేరారు. ఊపిరితిత్తుల్లో చేరిన నీటిని తొలగించడంతో దిలీప్ కుమార్ ఆరోగ్యం కాస్త మెరుగుపడింది. ఆయన భార్య సైరా భాను సోషల్ మీడియాలో దిలీప్ కుమార్ ఆరోగ్యంగానే ఉన్నారని పేర్కొన్నారు. మళ్లీ ఈరోజు తెల్లవారుజామున ఆయన అనారోగ్యం బారిన పడటంతో ఉదయం 7.30 గంటలకి కన్ను మూశారు.
దిలీప్ కుమార్ మరణ వార్తతో బాలీవుడ్ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చిన్న, పెద్ద నటీనటులంతా దిలీప్ కుమార్ ఇకలేరనే వార్త తెలిసి షాకవుతూ ఆయనకు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలుపుతున్నారు. హిందీ సినిమాల్లో దిలీప్ కుమార్ ప్రస్థానం చాలా పెద్దది. ముఖ్యంగా మహిళలు, ఫ్యామిలీ ప్రేక్షకుల్లో దిలీప్ కుమార్ చెరగని స్థానాన్ని సంపాదించుకున్నారు. ట్రాజెడీ కింగ్ అనే బిరుదును సొంతం చేసుకున్నారు. దశాబ్దాల క్రితం దిలీప్ కుమార్ చేసిన సినిమాలను చూస్తే ఇప్పటికీ కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. అంత గొప్ప నటుడ్ని కోల్పోవడం బాలీవుడ్ పరిశ్రమకే కాదు యావత్ భారత సినీ పరిశ్రమకు తీరని లోటు.