Bandla Ganesh: తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం సినిమాలను నిర్మిస్తూ మరోవైపు రాజకీయాలలో పాల్గొంటూ బిజీ బిజీగా ఉన్నారు. ఒకప్పుడు నటుడిగా పలు సినిమాలలో నటించిన బండ్ల గణేష్ ఇప్పుడు నిర్మాతగా మారి సినిమాలను నిర్మిస్తున్నారు. సినిమాలలో నటించకపోయినప్పటికీ తరచూ ఏదోక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. ఆ సంగతి పక్కన పెడితే తాజాగా టాలీవుడ్ నటుడు కోటా శ్రీనివాసరావు మరణించిన విషయం తెలిసిందే.
750కి పైగా సినిమాలలో నటించి విలక్షణ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా జూలై 13న ఫిలిం నగర్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో తెలుగు సిని పరిశ్రమ ఒక్కసారిగా మూగబోయింది. అంతే కాకుండా ఆయన మరణంతో ఒక్కసారిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి. సినీతారలు భావోద్వేగానికి లోనయ్యారు. నిర్మాత బండ్ల గణేశ్ సైతం కోట ఇంటికి చేరుకుని ఆయన పార్థివదేహానికి నివాళులు అర్పించారు. కొద్దిరోజుల క్రితమే ఆయన్ను కలిశానని, అప్పుడు ఆయన పరిస్థితి చూడలేకపోయానని అన్నారు.
భగవంతుడు పిలుస్తాడని ఆరోజే అనుకున్నానని మీడియాతో మాట్లాడాడు. కోటగారంటే ఇష్టమని, ఆయన పేరు చిరస్థాయిలో నిలిచిపోతుందంటూ నటుడి మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. అయితే అదే రోజు బండ్ల గణేష్ ఒక పోస్ట్ పెట్టగా దానిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చాలారోజుల తర్వాత స్నేహితులు ఇంటికొచ్చి కలిశారంటూ ఎక్స్ లో ఒక ఫోటో షేర్ చేశాడు. అందులో శ్రీకాంత్, శివాజీ రాజా, అలీ, ఉత్తేజ్ ఉన్నారు. వీళ్లందరూ వినోదం సినిమాలో కలిసి యాక్ట్ చేశారు. దీంతో ఇది చూసిన నెటిజన్స్ మీరందరూ వినోదం సినిమాకు సీక్వెల్ తీయండి, బాగుంటుంది అని సలహాలు ఇస్తున్నారు. ఇంకొందరు కోటాగారు చనిపోయింది ప్రొద్దునే కదా మీరప్పుడే సిట్టింగ్ మొదలుపెట్టారా?, కానీ గ్లాసులు దాచేసి భలే కవర్ చేశారు, అయినా కోటగారు మరణించారన్న బాధ మీకు కాస్తయినా ఉంటే కదా? అంటూ మండి పడుతున్నారు. మరి ఈ కామెంట్స్ పై బండ్లన్న ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.

