విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని రాజకీయ పార్టీలు శపథాలు చేస్తున్నాయి. కేంద్రానికి లేఖ రాశామని జగన్ అంటుంటే రాజీనామాలకు కూడ సిద్ధమని టీడీపీ అంటోంది. ఇప్పటికే గంటా రాజీనామా చేసి హడావుడి చేస్తున్నారు. చంద్రబాబుగారైతే ఏకంగా జగన్ ఈ పోరాటానికి నాయకత్వం తీసుకోవాలని, 175 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి పోరాడుదామని అంటున్నారు. బీజేపీ, జనసేనల ధోరణి వేఫర్ రకంగా ఉంది. పైకి ఇది కరెక్ట్ కాదని అంటారే కానీ పోరాడతామని హామీ ఇవ్వడం కానీ పోరాటంలోకి దిగడం కానీ చెయ్యట్లేదు. కేంద్రం రాత్రికి రాత్రి ఈ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తీసుకోలేదు. అలా తీసుకుని ఉంటే పరిస్థితులు, పోరాటాలు వేరేలా ఉండేవి.
ఈ ప్రక్రియ మూడేళ్ల నుండి జరుగుతూనే ఉంది. కార్మిక సంఘాలు తప్పక రాజకీయ పార్టీలు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఒక్కరంటే ఒకరు కూడ మాట్లాడలేదు. ఇప్పుడు రాజీనామాలకు సిద్ధమంటున్న చంద్రబాబు నాయుడు ఆనాడు తన హయాంలోనే ఈ కేంద్రం అమ్మకానికి ప్రణాళిక రచించుకుంటున్నా మాటైనా మాట్లాడలేదు. ఎదురుతిరగడం సంగతి అటుంచితే తమ బాధ్యతగా నష్టాల్లో ఉన్న ప్లాంటును లాభాల్లోకి తీసుకురావడం ఎలాగో కనీస సలహాలు కూడ ఇవ్వలేదు. ఇక ఆనాడు ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ జగన్ సైతం ప్రైవేటీకరణ ప్రక్రియను ప్రశ్నించలేదు. కేంద్రం ఎందుకిలా చేస్తోంది, రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోదా అంటూ చంద్రబాబును నిలదీయలేదు. నిత్యం తనకు అన్యాయం జరిగింది, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ తిరిగారు తప్ప పట్టించుకోలేదు.
కానీ ఇప్పుడేమో కేంద్రానికి లేఖ రాశాం, ఇది అన్యాయమని అంటున్నారు. మొదట్లో పోరాడకుండా అంతా అయిపోయాక నామ్ కె వాస్తే హడావుడి చేస్తున్నారు. ఎవరికి వారు డిమాండ్లు వినిపిస్తున్నారు. మరి అప్పుడు లేని చిత్తశుద్ధి నాయకులకు ఇప్పుడే వచ్చింది అనుకుంటే అందరూ కలిసి పోరాడాలని సదుద్దేశ్యమే ఉంటే ఒక జేఏసీని ఏర్పాటు చేసుకుని దానికి జగన్ అధ్యక్షుడిగా, చంద్రబాబు ఉపాధ్యక్షుడిగా మిగతా నాయకులు కార్యదర్శిలుగా, వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఉండి పోరాడవచ్చు కదా. అలా చేయరు. ఎవరికివారు వేరొకరి మీదకు బాధ్యతను తోసేస్తూ ఉంటారు. ముందు మన నాయకులు నేర్చుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వం మీద భయం లేకుండా పోరాడటం.