తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి కేసీఆర్ ఫైర్ అయితే ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. పాలన విషయంలో ఓ నియంతలా వ్యవహరిస్తారని ప్రతిపక్షాలు సహా ప్రజల నుంచి కేసీఆర్ పై కాస్త వ్యతిరేకత అయితే ఉంది. ఆయన దూకుడు చర్యలు..దూకుడు మాటలు అన్నివేళలా పనిచేయవని ఎప్పటికప్పుడు ప్రతిపక్షాలు ద్వజమెత్తుతూనే ఉంటాయి. ఆయన స్పీడ్ కు బ్రేకులేసేది ఫైర్ బ్రాండ్, కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మాత్రమే. కేసీఆర్ కి సరైన పోటీనిచ్చేది…అంత సత్తా రేవంత్ రెడ్డిలోనే ఉందన్నది కాంగ్రెస్ నమ్మకం. తాజాగా కేంద్రం ప్రకటించిన 21 లక్షల కోట్ల ప్యాకేజీపై కేసీఆర్ అది ప్యాకేజీనా…పాడుగాను అంటూ వెటకారంగా మాట్లాడిన సంగతి తెలిసిందే.
కేంద్రంపై ఎప్పటికప్పుడు నిప్పులు చెరిగే కేసీఆర్ ఈసారి కూడా పాత పంథాలనే తనదైన శైలిలో కేంద్రాన్ని విమర్శించారు. పక్క రాష్ర్ట సీఎం జగన మోహాన్ రెడ్డి ప్యాకేజీపై ఎలాంటి కామెంట్ చేయకపోయినా కేసీఆర్ మాత్రం ఒంటి కాలపై లేచి పడి మీడియాలో హైలైట్ అయ్యారు. దీంతో కేసీఆర్ తీరుపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. దేనికైనా భాష ప్రధానమని..అది కేసీఆర్ కు అసలు తెలుసా? అని సందేహం వ్యక్తం చేసారు. మోదీ వెనుక దేశమంతా ఉందని న్యూయార్క్ టైమ్స్ సహా 50 అంతర్జాతీయ పత్రికలు ప్రచురించాయన్న సంగతి కేసీఆర్ తెలుసుకోవాలన్నారు.
ఆడ్రస్ లేని వాళ్లు చెబితే ప్రధానిని విమర్శించడం కేసీఆర్ కు తగదని చెప్పారు. కష్టకాలంలో ఓటు బ్యాంక్ రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. కేంద్రం మొదటి నుంచి మీ వైఖరి పట్ల ఓ కన్నేసి ఉంచిందని హెచ్చరించారు. ఇకనైనా నోటికొచ్చిన మాటలు మానుకోవాలని మండిపడ్డారు. కేంద్రం పేదలకు ఎలాంటి సహాయం అందిస్తుందో తెలుసునని, మీరు చెబితే నమ్మే పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు లేరని ఎద్దేవా చేసారు. మీరు అధికారంలోకి వచ్చాక తెలంగాణ ప్రజలు ఎంత సుభిక్షంగా ఉన్నారో అందరికీ తెలుసునని మండిపడ్డారు. భవిష్యత్ రాజకీయాలకు ఇలాంటి వ్యాఖ్యలు గానీ, విధానం గానీ మంచిది కాదని హితవు పలికారు.