Kuppam : కుప్పంలో వైసీపీ గెలిస్తే, టీడీపీ పరిస్థితేంటి.?

Kuppam :  తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు 2024 ఎన్నికల్లో సొంత నియోజకవర్గం కుప్పంలో ఓడిపోబోతున్నారా.? వైసీపీ వ్యూహాలు చూస్తోంటే, చంద్రబాబుకి సొంత నియోజకవర్గంలో ఓటమి తప్పేలా కనిపించడంలేదు. స్థానిక ఎన్నికల్లో వైసీపీ, కుప్పం నియోజకవర్గంలో సత్తా చాటిన విషయం విదితమే.
అధినేత ఓడిపోతే, ఆ పార్టీ పరిస్థితి ఎలా వుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబుకి ఎదురీత తప్పదని 2019 ఎన్నికల్లోనే నిరూపితమయ్యింది. అయితే, ఆయన ఎలాగోలా ఆ ఎన్నికల్లో గట్టెక్కేశారు. కానీ, ఈసారి చంద్రబాబు తన నియోజకవర్గం మార్చుకోకపోతే, ఓడిపోక తప్పేలా లేదు.
ఏం చేసినా, సొంత నియోజకవర్గంలో చంద్రబాబు తగిన మద్దతుని కూడగట్టుకోలేకపోతున్నారు.. ప్రజల అభిమానాన్ని చూరగొనలేకపోతున్నారు. ముఖ్యమంత్రిగా వున్న సమయంలో కుప్పం నియోజకవర్గాన్ని చంద్రబాబు పట్టించుకోకపోవడమే కుప్పం ప్రజలకు చంద్రబాబు మొహం మొత్తేయడానికి కారణమన్న విమర్శలు లేకపోలేదు.
అయితే, కుప్పంలో వైసీపీ మమ్మల్ని ఓడించడం కాదు.. పులివెందులలో వైసీపీనే టీడీపీ చేతిలో ఓడిపోబోతోంది.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఓడిపోవడం ఖాయం.. అని టీడీపీ ఎదురుదాడికి దిగుతోంది.
రాజకీయాల్లో ఎత్తులకు పై యెత్తులు మామూలే. అదే సమయంలో ఈక్వేషన్స్ ఎప్పుడెలా మారిపోతాయో చెప్పలేం. ప్రస్తుతానికైతే టీడీపీ అధినేతకు కుప్పం నియోజకవర్గంలో కష్ట కాలమే కనిపిస్తోంది.
మరి, పులివెందులలో వైఎస్ జగన్ పరిస్థితేంటి.? వివేకా హత్య కేసుపై ఎటూ తేల్చలేకపోవడం సహా, నియోజకవర్గంలో బస్టాండుని సైతం నిర్మించలేకపోవడం.. వంటివి వైసీపీ వైఫల్యాలుగా కనిపిస్తున్నాయి. అవి అధినేత వైఎస్ జగన్ ఓటమికి కారణమవుతాయనే భావన కార్యకర్తల్లో కనిపిస్తోందన్నది టీడీపీ తెరపైకి తెస్తున్న వాదన.
వైసీపీ సంగతి పక్కన పెడితే, కుప్పం కోల్పోయాక చంద్రబాబు రాజకీయ భవితవ్యమేంటి.? టీడీపీ భవిష్యత్తు ఏంటి.? కాలమే సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలివి.