దుబ్బాక ఉప ఎన్నికల్లో బాధ్యత మొత్తం నెత్తిన వేయడంతో అహర్నిశలూ కష్టపడ్డారు హరీష్ రావు. కానీ ఫలితం దక్కలేదు. పార్టీ ఓటమి పాలైంది. దీంతో తెరాసలో హరీష్ రావుకు ఇకపై గడ్డుకాలమే అనుకున్నారు. హరీష్ సైతం దుబ్బాక ఓటమికి పూర్తి బాధ్యత తీసుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ పరిణామంతో పార్టీలోని ఒక వర్గం లోలోపల బాగా సంతోషపడిపోయింది. ఇక కేసీఆర్ బుర్రలో హరీష్ రావుకు చోటు ఉండదని అంతా భావించారు. అయితే కొన్నిరోజులకే హరీష్ రావుకు మరోసారి తన సత్తా ప్రూవ్ చేసుకునే అవకాశం వచ్చింది. గ్రేటర్ ఎన్నికల కోసం తెరాస అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. అందులో కొందరు సిట్టింగ్ కార్పొరేటర్లకు చోటు దక్కలేదు.
దీంతో అసంతృప్తి స్వరం మొదలైంది. అధిష్టానంతో చర్చలు జరిగాయి. కానీ కేసీఆర్ 150 అంన్డి జాబితాలో ఎవ్వరి పేరూ మార్చేది లేదని తేల్చేశారు. ఆమేరకు కేటీఆర్ అసంతృప్తులకు ఈసారికింతే అన్నట్టు క్లారిటీ ఇచ్చేశారు. దీంతో అలిగిన కొందరు బీజేపీలోకి వెళ్లాలని డిసైడ్ అయ్యారు. ఇంకొందరు ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పోటీకి దిగడానికి సిద్ధమయ్యారు. దీంతో అధిష్టానం చిక్కుల్లో పడింది. అసంతృప్తులను శాంతింపజేసి పార్టీలోనే ఉండేలా చేయడం ఎలాగోనని ఆలోచిస్తూ ట్రబుల్ షూటర్ హరీష్ రావును రంగంలోకి దింపారు. బుజ్జగింపుల్లో హరీష్ రావుది అందెవేసిన చేయి. పార్టీని వీడిన వారిని వెనక్కు తీసుకురావడంలో ఆయన వ్యూహాలు బాగా పనిచేస్తాయి.
కేసీఆర్ పిలుపు మేరకు రంగంలోకి దిగిన హరీష్ రావు ఇక పని మొదలుపెట్టేశారు. అసలే దుబ్బాకలో ఓడిన కసి మీదున్న ఆయన ఈ అవకాశాన్ని పరిపూర్ణంగా వినియోగించుకోవాలని పనిచేస్తున్నారు. ఇప్పటికే పార్టీని వీడేందుకు రెడీ అయిన ఇద్దరు నేతలకు సర్దిచెప్పి పార్టీలోకి తీసుకొచ్చారట. టికెట్ దక్కక తెరాస అభ్యర్థుల గెలుపుకు కృషిచేయరేమోననే అనుమానం ఉన్న ఇంకొందరిని కూడ హరీష్ రావు కలుస్తున్నారట. ఏదో విధంగా నచ్చజెప్పి వారిని దారిలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా హరీష్ తన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తుంటే అవతల కేటీఆర్ సంగతే ఆందోళనకరంగా ఉంది.
ఈ ఎన్నికల్లో గెలుపు బాధ్యతలు ఆయన మీదే ఉన్నాయి. 2016 గ్రేటర్ ఎన్నికల్లో బాధ్యతలు తీసుకున్న కేటీఆర్ 99 సీట్లతో అఖండం విజయాన్ని సాధించుకొచ్చి పార్టీలో నెంబర్ 2 అయిపోయారు. ఇప్పుడు ఆయన టార్గెట్ 100. అయితే 2016 పరిస్థితులకు ఇప్పటి పరిస్థితులకు చాలా తేడా ఉంది. అప్పుడు పార్టీ మీద వ్యతిరేకత అనే మాటే లేదు. ప్రచారం చేయకపోయినా గెలవడం ఖాయమనేలా ఉండేది వాతావరణం. కానీ ఇప్పుడు వరదలు, దుబ్బాక ఓటమి భారం, నిరుద్యోగుల ఆగ్రహం, బలమైన ప్రత్యర్థులు వెరసి గెలుపు కష్టతరమైంది. చెప్పినట్టు 100 సీట్లు సాధించడం అంత సులభమైన పని కాదు. మేయర్ పీఠం గురించి బాధలేదు కానీ మెజారిటీ మీదే అనుమానాలున్నాయి. 100 స్థానాలు గెలవకపోతే కేటీఆర్ ప్రతిష్ట దెబ్బతినడం ఖాయమంటున్నాయి రాజకీయ వర్గాలు. మరి కేటీఆర్ ఈ సంకట పరిస్థితిని ఎలా డీల్ చేస్తారో చూడాలి.