విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయకండి అని కేంద్రాన్ని ఎంతగా కోరుతున్నా కూడా కేంద్రం కనికరించడం లేదు. కానీ, దీనిపై తెలంగాణ నేతలు స్పందిస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాల ఆందోళనలు మిన్నంటుతున్నాయి. సోమవారం లోక్ సభలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ సమాధానంతో ప్రైవేటీకరణ తప్పదని తేలిపోయింది. దీంతో జాతీయ స్థాయిలో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి.
ఇందులో భాగంగా రాజకీయ పార్టీలన్నీ తమ ఉద్యమానికి మద్దతు తెలపాలని కోరుతున్నాయి కార్మిక సంఘాలు.. ఢిల్లీలోని ఏపీ భవన్ లో మాట్లాడిన కార్మిక సంఘం నేతలు.. సీఎం కేసీఆర్ సైతం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకించాలని.. తమ ఉద్యమానికి మద్దతు ప్రకటించాలని కోరాయి.. దీనిపై ఇంత త్వరగా రియాక్షన్ వస్తుందని కార్మిక సంఘాలు ఊహించలేదు. కానీ మంత్రి కేటీఆర్ స్వయంగా ఉక్కు ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నట్టు ప్రకటించారు. విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం కాకుండా చేస్తున్న పోరాటానికి మద్దతు తెలుపుతామన్నారు కేటీఆర్.. అవసరమైతే విశాఖ వెళ్లి మద్దతిస్తామని స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వాలను కూడా మోదీ ప్రభుత్వం ప్రైవేట్‌పరం చేసేలా ఉందని విమర్శించారు. తెలంగాణలోని బయ్యారంలో సెయిల్ ద్వారా ఉక్కు కర్మాగారం పెడతాం, వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీలు ఇస్తున్నారని కానీ, విశాఖలో పోరాడి సాధించుకున్న ఉక్కు కర్మాగారాన్ని వంద శాతం అమ్మేసే ప్రయత్నం చేయడం దారుణమన్నారు. కేంద్రం నిర్ణయంతో వేలాది మంది ఉక్కు ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖలో ఉక్కు ఉద్యోగులందరికీ అండగా నిలబడాల్సిన అవసరం ఉందన్నారు కేటీఆర్.
అవసరమైతే కేసీఆర్ ఆనుమతితో వైజాగ్ వెళ్లి ప్రత్యక్షంగా వారి పోరాటానికి మద్దతు తెలుపుతానని ఆయన హామీ ఇచ్చారు. ఎక్కడో విశాఖలో ఉద్యమం జరుగుతుంటే మనకు ఎందుకులే అని మనం ఊరుకుంటే, రేపు తెలంగాణ దగ్గరకు కూడా కేంద్రం వస్తుందని కేటీఆర్ మండిపడ్డారు. ఇవాళ విశాఖ ఉక్కును అమ్ముతున్నారని, రేపు బీహెచ్‌ఈఎల్ కూడా అమ్మేస్తారని ఎల్లుండి సింగరేణిని కూడా అమ్ముతాం అంటారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఉక్కు ఉద్యమానికి మద్దతిస్తామని.. అయితే ఒక కండిషన్ కూడా పెట్టారు. తెలంగాణలో ప్రభుత్వ సంస్థలను కేంద్రం అమ్మే ప్రయత్నం చేస్తే.. ఆంధ్ర ప్రజలు కూడా తమాతో కలిసిరావాలి అని మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.