ఒకే దేశం ఒకే పన్ను.. వ్యాక్సిన్ ధర ఒకేలా ఎందుకు లేదు.?

KTR Slams PM Modi Regarding Covid vaccine Price

KTR Slams PM Modi Regarding Covid vaccine Price

సామాన్యుడికి అందాల్సిన వ్యాక్సిన్ విషయంలో కేంద్రానికి ఓ ధర, రాష్ట్రానికి ఇంకో ధర.. ఇదెక్కడి అన్యాయం.? అంటూ తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) సోషల్ మీడియా వేదికగా ప్రధాని నరేంద్ర మోడీని ప్రశ్నించారు. సీరం ఇనిస్టిట్యూట్, కోవిషీల్డ్ టీకా ధరల్ని నిన్న వెల్లడించిన విషయం విదితమే. కేంద్రానికి 150 రూపాయలకే ఓ డోసు వ్యాక్సిన్ అందిస్తున్న సీరం సంస్థ, రాష్ట్రాలకు మాత్రం ఒక్కో డోసుకీ 400 రూపాయల ధరను నిర్ణయించింది.

ప్రైవేటు ధర ఏకంగా 600 రూపాయలు. ఈ అంశంపై ఇప్పటికే దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అను నిత్యం వేలాది ప్రాణాలు కరోనా వైరస్ కారణంగా పోతున్నప్పటికీ, వ్యాక్సిన్ పేరుతో ఈ వ్యాపారమేంటి.? అన్నది సామాన్యుడి దగ్గర్నుంచి రాజకీయ నాయకుల వరకు వెల్లువెత్తుతున్న ప్రశ్న. ‘ఒకే దేశం.. ఒకే పన్ను అన్నారు.. జీఎస్టీకి అంగీకరించాం.. మరిప్పుడు వ్యాక్సిన్ విషయంలో ఎందుకీ అన్యాయం.? పీఎం కేర్స్ ద్వారా అందరికీ వ్యాక్సిన్ కేంద్రమే ఎందుకు ఇవ్వదు.?’ అంటూ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. ఇప్పడీ ప్రశ్న వైరల్ అయ్యింది. నిజానికి, పేరుకే జీఎస్టీ.. ఒకే దేశం.. ఒకే పన్ను. కానీ, పెట్రో ఉత్పత్తుల్ని జీఎస్టీ పరిధిలోకి తీసుకురాలేదు. జీఎస్టీలోనూ రకరకాల స్లాబులున్నాయి. మన దేశంలో ప్రభుత్వాలు, రాజకీయ పార్టీల నిబద్ధత ఇంతే.

ఇంతకు మించిన నిబద్ధతను పాలకుల నుంచి ఆశించలేం. రోమ్ తగలబడిపోతోంటే, నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించినట్లు.. దేశం తగలబడిపోతోంటే, పాలకులు పబ్లిసిటీ ఫిడేల్ వాయిస్తున్నారంతే. సరిపడా వ్యాక్సిన్ సరఫరా చేయలేక, సరిపడా మందులు సరఫరా చేయలేక, సరిపడా ఆక్సిజన్ కూడా సరఫరా చేయలేని వైఫల్యాన్ని చూశాక, దేశం వెలిగిపోతోందని ఎవడైనా అనగలడా.? ఛాన్సే లేదు. రోజుకి రెండున్నర లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు కొత్తగా నమోదవుతోంటే, తాము దేశాన్ని ఉద్ధరించేశామంటూ ఇటీవల సందేశమిచ్చిన ప్రధాని మోడీ, వాస్తవ పరిస్థితుల్ని గుర్తెరిగి కీలక నిర్ణయాలు తీసుకోకపోతే, దేశ భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందన్నది నిర్వివాదాంశం.