కేటీయార్ ఉవాచ: విభజనతో రెండు రాష్ట్రాలూ అభివృద్ధి చెందాయ్.!

తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అలియాస్ కేటీయార్, ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజనతో రెండు తెలుగు రాష్ట్రాలూ అభివృద్ధి చెందాయని వ్యాఖ్యానించారు. ఓ ప్రైవేటు యూనివర్సిటీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులతో మాట్లాడిన సందర్భంలో కేటీయార్ ఈ వ్యాఖ్యలు చేశారు. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాదన్న కేటీయార్, ప్రభుత్వ ఉద్యోగాల కంటే ప్రైవేటు ఉద్యోగాల్లో యువతకు మెరుగైన అవకాశాలు వుంటాయన్న విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రభుత్వ విభాగాల్లో ఎప్పటికప్పుడు ఖాళీల్ని భర్తీ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. దళిత బంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందనీ కేటీయార్ చెప్పుకొచ్చారు.

కేంద్రం 20 లక్షల కోట్ల ప్యాకేజీ.. అంటూ కరోనా పాండమిక్ నేపథ్యంలో ప్రకటించినా, ఆ సొమ్ములు ఏమైపోయాయో ఎవరికీ తెలియదని కేటీయార్ ఎద్దేవా చేశారు. తెలంగాణ అభివృద్ధి పథంలో నడుస్తోందనీ కేటీయార్ చెప్పుకొచ్చారు. అయితే, విభజనతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కుంటుపడిందన్నది బహిరంగ రహస్యం. ఏడేళ్ళవుతున్నా ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరైన ఆదాయం లేదు. ఏడాదికేడాది అప్పులు అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. కేంద్రం మీద పూర్తిగా ఆధారపడాల్సిన దుస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానిది. తెలంగాణ రాష్ట్రం కాళేశ్వరం ప్రాజెక్టుని పూర్తి చేసుకోగా, జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరాన్ని పూర్తి చేసుకోలేకపోతోంది ఆంధ్రప్రదేశ్. విభజనతో తెలంగాణకు మేలు జరిగి వుండొచ్చు. కానీ, ఆ విభజనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి గొడ్డలి పెట్టులా తయారైంది.