కేటీయార్ ‘యాంటీ జగన్’ నినాదం బెడిసి కొట్టిందా.?

KTR Anti Jagan Slogan

KTR Anti Jagan Slogan : రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఒకప్పుడు ‘తెలంగాణ ద్రోహులు’ అంటూ టీఆర్ఎష్ ఎవరి మీద ముద్ర వేసినా, అది బాగా వర్కువట్ అయ్యేది ఆ పార్టీకి. కానీ, ఇప్పుడు సీన్ మారింది. అప్పటి ఉద్యమ సెగని మళ్ళీ రాజేయడం తెలంగాణ రాష్ట్ర సమితికి సాధ్యం కావట్లేదు.

వరుసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితికి ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక సెగ అనేది వుంటుంది. నిజానికి, 2019 పార్లమెంటు ఎన్నికల్లోనే తెలంగాణ రాష్ట్ర సమితికి ఈ సెగ తగిలింది. అయితే, కేసీయార్ తనదైన వ్యూహాలతో అలా నెట్టుకుంటూ వచ్చేశారు.

2023 అసెంబ్లీ ఎన్నికల కోసం ముందస్తుగానే సన్నద్ధమవుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి, ప్రయోగాత్మకంగా యాంటీ జగన్ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చింది. ఈ వ్యవహారంలో గులాబీ పార్టీకి తల బొప్పి కట్టిందన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతోన్న చర్చ.

తాను తెరపైకి తెచ్చిన ‘పొరుగు రాష్ట్రంలో అభివృద్ధి నిల్’ అనే కాన్సెప్ట్ అట్టర్ ఫ్లాప్ అవడంతో కేటీయార్ మాట మార్చిన సంగతి తెలిసిందే. వైసీపీ అభిమానులు ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో గులాబీ పార్టీకి మైండ్ బ్లాక్ అయ్యేలా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

గులాబీ పార్టీకి అనుకూలంగా ఓటెయ్యకపోతే, వాళ్ళ ముందున్న ఆప్షన్స్ కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, మజ్లిస్, వైఎస్సార్ తెలంగాణ పార్టీ మాత్రమే. వీటిల్లో వైఎస్సార్ తెలంగాణ పార్టీకి వైసీపీ ఓట్లు మళ్ళడం దాదాపు ఖాయంగానే కనిపిస్తోంది. మరి, ఆ వైఎస్సార్ తెలంగాణ పార్టీని గులాబీ పార్టీ మిత్రపక్షంగా మలచుకుంటేనో.!