ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దూకుడుకు బ్రేక్ పడింది. అసలు మ్యాటర్ ఏంటంటే.. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి టెండర్లు పిలిచేందుకు జగన్ సర్కార్ సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. అయితే పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకానికి సంబంధించి టెండర్లను నిలుపుదల చేయాలని కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు ఆదేశిస్తూ.. ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది.
రాయలసీమ ప్రాజుక్ట్ రాష్ట్ర పునర్విభజన చట్టానికి విరుద్ధంగా ఉందని కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు పేర్కొంది. దీంతో ప్రస్తుతం పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల ప్రాజెక్ట్ పై ముందుకు వెళ్ళొద్దని ఆదేశించింది. ఇక గతంలో రాయలసీమ ప్రాజెక్ట్‌కు సంబంధించి అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేదని, దీంతో పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్‌ను నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం తనపని తాను చేసుకుంటూ ముందుకు వెళుతోంది.
అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కోసం టెండర్లు పిలిచేందుకు ఏపీ సర్కారు సన్నాహాల్లో ఉండగా, తెలంగాణ సర్కార్ మరోసారి కృష్ణాబోర్డుకు ఫిర్యాదు చేసింది. దీంతో ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసిన కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు.. ఈ ప్రాజెక్టుకు సంబందించి అపెక్స్ మండలి ఆమోదం తెలపలేదని, అంతేకాకుండా ఈ ప్రాజెక్టు డిపిఆర్‌ను కూడా తమకు సమర్పించలేదని లేఖ ద్వారా తెలిపింది. అయితే కృష్ణా బోర్డు నుండి గతంలోనే ఇలాంటి లేఖలు వచ్చినా, పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిన ఏపీ సర్కార్, కృష్ణా బోర్డు తాజా లేఖను పట్టించుకునే అవకాశం ఉందా అనేది చూడాలి.