కోనసీమ మంట వెనుక పాత్రధారి ఇతనేనా.?

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమ ప్రాంతం కోనసీమ పేరుతో కొత్త జిల్లాగా ఏర్పాటయ్యాక, దాని పేరుని మార్చడంలో ప్రభుత్వ పెద్దల ఆంతర్యమేంటి.? ఈ గలాటా వెనుక అధికార పార్టీ పాత్ర ఎంత.? అన్న చర్చ జరుగుతున్న తరుణంలో, ఈ మొత్తం వివాదానికి కారకుడిడనేంటూ కొన్ని ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఎవరా వ్యక్తి.?

కోనసీమలో కనీ వినీ ఎరుగని విధ్వంసానికి కారణమైన ఈ మొత్తం వివాదంలో అన్యం సాయి అనే వ్యక్తి గురించి సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఈ అన్యం సాయి అనే యువకుడు, కోనసీమ జిల్లా పేరు మార్చొద్దంటూ ఒంటి మీద కిరోసిన్ పోసుకుని నిప్పంటుకునే ప్రయత్నం చేశాడు. పక్కనే వున్న అతని అనుచరులు, ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు.

అక్కడితో, అనూహ్యంగా మారిపోయాయి పరిణామాలన్నది ప్రస్తుతం కోనసీమలో ప్రముఖంగా వినిపిస్తోన్న ఓ వాదన. ఎవరీ అన్యం సాయి.? అంటే, జనసేన కార్యకర్త.. పవన్ కళ్యాణ్ అభిమాని.. అంటూ ప్రచారం చేస్తున్నారు వైసీపీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తలు.

అయితే, అన్యం సాయికి వైసీపీతో సన్నిహిత సంబంధాలున్నాయి. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సహా, వైసీపీకి చెందిన చాలా మంది నేతలతో అత్యంత సన్నిహితంగా వ్యవహరించాడు గతంలో అన్యం సాయి. ఆయా నేతల కోసం తన పేరుతో బ్యానర్లు కట్టడం దగ్గర్నుంచి చాలా వ్యవహారాలు నడిపాడు.

గతంలో జనసేన పార్టీలోనూ అన్యం సాయి తిరిగిన దరిమిలా, జనసేన మీదకు మొత్తం వివాదాన్ని తోసేసేలా అన్యం సాయిని ముందు పెట్టి ఈ కుట్రని ఎవరైనా నడిపించారా.? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.